తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయం

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయం

చకచక జరుగుతున్న పనులు, మారుతున్న పరిణాలమాలు చూస్తే ముందస్తు ఖాయంగానే కనబడుతోంది. ఈ నెల ఆరో తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కలసి వచ్చే రోజని, ఆ రోజే తెలంగాణ శాసన సభను రద్దు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగానేఈ నెల రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితీ ప్రగతి నివేదన సభను కూడా జరిపింది. ఈ సభ విజయవంతమైందని అధికార పార్టీ, తస్సుమందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అది వేరే సంగతి. సభ జరగడం మాత్రం ముందస్తు ఎన్నికలలో భాగమేనని ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే అధికార వర్గాలలో కూడా పనులు ఊపందుకుంటున్నాయి. శాసనసభ రద్దుకు రెండు రోజులే సమయం ఉన్నందున మంగళ, బుధవారాలలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. మంగళవారం నాడు జరిగిన రాజకీయ, అధికార పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే ముందస్తు ఖాయంగానే కనబడుతోంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు కలిసారు. మరోవైపు రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శితో ఎన్నికల కమీషనర్ భేటి అయ్యారు. ఇక ఎమ్మెల్యేలకు వివిధ పనుల నిమ్మిత్తం కేటాయించాల్సిన  నిధులపై ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆర్దిక శాఖ నుంచి సూచనలు వెళ్లాయి. అది కూడా ఈ నెలాఖరు లోగా పూర్తి చేయలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం.

గవర్నర్ నరసింహన్‌ను ఉన్నత స్థాయి అధికారులు కలవడం వెనుక ముందస్తు ఎన్నికల కోసమేనని అంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం అధికారులు కలవడం, గవర్నర్ నరసింహ‌న్‌ను ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్‌ శర్మ, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి నరసింగ రావు కలవడం చర్చనీయాంశం అవుతోంది. ఇక రాజకీయంగా కూడా టీఆర్ఎస్ పార్టీ తన శంఖారావాన్ని పూరిస్తోంది. రానున్న 50 రోజులలో 100 నియోజకవర్గాలలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభలకు ప్రజా ఆశీర్వాద సభలు అనే పేరును కూడా నిర్ణయించారు. దీనికి నాందీ ప్రస్తావనగా ఈ నెల ఏడో తేదీన హుస్నాబాద్‌లో తొలి ఎన్నికల సభ నిర్వహించాలని నిర్ణయించారు.

2014లో జరిగిన ఎన్నికలలో కూడా తొలిసభను హుస్నాబాద్‌లోనే నిర్వహించడం గమనార్హం. సెంటిమెంట్లను ఎక్కువగా పరిగణలోకి తీసుకునే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దానిని అనుసరించే హుస్నాబాద్ లో తొలి సభ నిర్వహించాలని తీర్మానించినట్లు సమాచారం. అటు అధికార యంత్రాంగం, ఇటు అధికార పక్షం చేస్తున్న హడావుడితో ముందస్తు ఎన్నికలు ఖాయంగానే కనపడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు