కేసీఆర్ ప్ర‌సంగం... నాట్ అప్‌టు ది మార్క్‌

కేసీఆర్ ప్ర‌సంగం... నాట్ అప్‌టు ది మార్క్‌

ఎంతో ఉరిమింది.....ఇంతే కురిసిందన్నట్లైంది తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రగతి నివేదన సభ. ముందస్తుపై ప్రకటన చేయకపోవ‌డం ఒక ఎత్త‌యితే...  అస‌లు ముఖ్యమంత్రి ప్రసంగంలో పసలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి వక్త అని, బాగా మాట్లడుతారని పేరు. కాని ఈ ప్రగతి నివేదన సభ అందుకు భిన్నంగా ఉంది. గత నెల రోజులుగా దేశంలో ఇలాంటి సభ ఎప్పుడూ, ఎన్నడు జరగలేదని. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తాము ఈ నాలుగేళ్లలో ఏం చేసామో ప్రజలకు తెలియ చెప్పడానికే ఈ ప్రగతి నివేదన సభ అని గత 20 రోజులుగా గులాబి దండు ఊద‌రగొట్టింది. కానీ చివరి నిమిషంలో సభను నీరుగార్చేసారు కేసీఆర్. ముందస్తు ప్రకటిస్తారని, తమకు వరాల జల్లు కురిపిస్తారని ఎదురు చూసిన సామాన్యులకు నిరాశే ఎదురైంది. ఈ మాత్రం సభకు 300 కోట్లు అవసరమా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రెండు గంటలు ఆలస్యంగా సభకు వచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, కేవలం 45 నిమిషాలలో తన ప్రసంగాన్ని ముగించడంతో జ‌నం ఆశ్చర్యానికి లోనయ్యారు. మొదట అరగంట కూడా 2014 అంటే తెలంగాణ సాధించడానికి ముందు తాము చేసిందే పదే పదే చెప్పారు. సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రుల వైఫల్యాలనే పదే పదే ఎత్తి చూపారు గాని, తెలంగాణ రాష్ట్ర సమితి గత నాలుగేళ్లలోసాధించిన ప్రగతి మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.అయితే ముఖ్యమంత్రి రాజకీయంగా రైటేనని, ఆయన తన చాణక్య నీతిలో ఈ ప్రగతి నివేదన సభ కూడా ఒక పావు కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అయితే తెలంగాణలో  వివిధ జిల్లాల నుంచి శనివారం ఉదయం నుంచీ కూడా సభ ప్రాంగణం దగ్గర పడిగాపులు కాసిన ప్రజలకు ఈ రాజకీయాలతో సంబంధం ఏమిటి. వారంతా కూడా తమ నాయకుడు తమ కోసం ఏదైన ప్రకటన చేస్తారేమో అని ఎదురు చూసిన ప్రజలకు ముఖ్యమంత్రి  ఏం సమాధానం చెబుతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ  ప్రగతి నివేదన సభలో అనుకున్న జోష్ క‌నిపించ‌లేద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. వారాశించింది ఏది కూడా కేసీఆర్ నుంచి గాని తెరాస నుంచి గాని ఈ సభ ద్వారా తమకు చేరలేదని ప్రగతి నివేదన సభకు హజరైన కొందరి అభిప్రాయం.

సభ అంటే లక్షలాది ప్రజలు, సభకు హాజరు కావడం కాదు అని, సభలోని ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరేలా చూడడమే అని కొందరి అభిప్రాయం. సభకు వచ్చిన వారందరూ తమ మద్దతుదారులే అని, లక్షలాది మంది ప్రజలు వస్తే ఆ సభ విజయవంతం అయినట్లు కాదని, సభకు వచ్చిన ప్రతి మనిషి ఓటు కూడా తమ పార్టీకే పడేటట్లు చేసుకున్నప్పుడే ఆ సభ విజయవంతమైనట్లు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ రెండు మూడు రోజుల్లో ఏదో ఇంట‌ర్న‌ల్ గా ఒక పెద్ద ప‌రిణామం జ‌ర‌గ‌డం వ‌ల్లే.. కేసీఆర్ ఇలా మెత్త‌బ‌డ్డారా అన్న అనుమానాలూ లేక‌పోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు