రాహుల్ గాంధీ టెంపుల్ రన్ స్కోర్ ఎంత?

రాహుల్ గాంధీ టెంపుల్ రన్ స్కోర్ ఎంత?

బీజేపీ పాలిత రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తుండడం.. ఆపై లోక్‌సభ ఎన్నికలూ ఉండడంతో  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెడీ అవుతున్నారు.  గుజరాత్ ఎన్నికలతో ప్రారంభించి, కర్నాటక ఎన్నికల్లో కొనసాగించి ఆ తరువాత బ్రేకిచ్చిన టెంపుల్ రన్‌ను ఆయన మళ్లీ కొనసాగిస్తున్నారు.

తాజాగా ఆయన ఏకంగా హిందువులకు అత్యంత పవిత్రమైన, పైగా అత్యంత క్లిష్టమైన కైలాస మానసరోవర యాత్రకు బయలుదేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలు ప్రయోగించి చూసి పెద్దగా ఫలితాలు రాకపోవడంతో ఇక మోదీని ఎదుర్కోవడానికి ఆయన మార్గంలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.

2014 ఎన్నికల్లో మోదీ తిరుగులేని ఆధిక్యంతో గద్దెనెక్కాక ఆయన్ను ఎదుర్కోవడం కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. అనంతరం కాలంలో ఆయన పలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో గత ఎన్నికల నాటి ఊపు కొంత తగ్గింది కానీ, కాంగ్రెస్, ఇతర పక్షాలేమీ తమ బలంతో ఆయన బలాన్ని తగ్గించలేకపోయాయి.

పైగా దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మోదీని ఎదుర్కోవడానికి సొంత బలాన్ని నమ్ముకోకుండా ఇతరులపై ఆధారపడడం ప్రారంభించింది.. మోదీ ముందు ఈ కుప్పిగంతులు పనిచేయకపోగా కాంగ్రెస్‌ చేయి బలహీనమైపోవడంతో కృత్రిమ హస్తాలను పరీక్షిస్తోందన్న భావన మిగతా పార్టీల్లో ఏర్పడిపోయింది.

ముఖ్యంగా కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ వంటివారిని ముందు పెట్టి మోదీపై యుద్ధానికి ప్రయత్నించింది. ఇవేవీ పనికిరాకపోవడంతో ఇప్పుడు రాహుల్ సొంత శక్తిని సంతరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెట్టుకున్న పండును పడగొట్టాలంటే పిక్కబలం పెంచుకుని చెట్టెక్కాలే కానీ చెట్టుకింద ఉన్న రాళ్లను ఏరుతూ దాంతో కొట్టాలని ట్రై చేయడం వల్ల భుజం నొప్పే తప్ప ఫలితం ఉండదని రాహుల్‌కు ఆలస్యంగానైనా అర్థమైనట్లుంది.

అందుకే, ఆయన స్వయంశక్తితో మోదీని ఢీకొట్టేందుకు బయలుదేరుతున్నారు. ఆ శక్తిని సంతరించుకునేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు.. అందులో భాగమే ఈ మానసరోవర యాత్ర. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్న సూత్రాన్ని నమ్ముతూ మోదీ హిందూత్వ ప్రభావాన్ని తగ్గించడానికి తానూ అదే మార్గంలో వెళ్లాలని రాహుల్ ఇప్పటికే ప్రగాఢంగా నమ్ముతున్నారు. గుజరాత్ ఎన్నికల నుంచే ఆయనలో ఈ అచంచల విశ్వాసం కనిపిస్తోంది.

మోదీ హిందూ ఓటర్ల ఏకీకరణ వ్యూహంతో ముందుకెళ్తూ విజయాలు సాధిస్తున్నారన్నది అన్ని రాజకీయ పార్టీల భావన. తొలుత హిందూ వ్యతిరేకతతో దాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలు చేసి విఫలం కావడంతో ఇప్పుడు మోదీ వద్ద పోగయిన హిందూ ఓట్లను చీల్చే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందులో భాగమే రాహుల్ టెంపుల్ రన్ అన్నది సుస్పష్టం.

గత ఏడాది గుజరాత్ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ గుళ్లూగోపురాలకు తిరగడం ప్రారంభించారు. అది కర్ణాటకలోనూ కొనసాగించారు. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు, 2019 ఎన్నికలు సమీపిస్తుండడంతో రాహుల్ మరోసారి ఆలయ రాజకీయాలు మొదలుపెట్టారు.

గుజరాత్ ఎన్నికల్లో ఈ ఆలయ రాజకీయాలు కొంతవరకు పనిచేశాయని కాంగ్రెస్ భావించడంతో ఆ వెంటనే జనవరిలో రాజస్థాన్ పీసీసీకి ఏఐసీసీ నుంచి ఒక ఆదేశం వెళ్లింది. ఆ రాష్ట్రంలో ముఖ్యమైన దేవాలయాలు ఏమున్నాయో లిస్టు పంపించమని కోరింది. రాహుల్ అక్కడకు వచ్చే వీలున్నవి, అక్కడికి ఆయన రావడం వల్ల పొలిటికల్ మైలేజి వచ్చే వీలున్నవి లిస్టు కావాలని కోరింది.

గుజరాత్ ఎన్నికల సమయంలో రాహుల్ ఆ రాష్ట్రంలోని 27 ఆలయాలను సందర్శించారు. అంతేకాదు.. దానిపై బీజేపీ విమర్శలు చేస్తే.. తాను శివభక్తుడినంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక కర్ణాటక ఎన్నికల సమయంలో  ఆ రాష్ట్రంలోని శృంగేరి శారదాంబ ఆలయాన్ని ఆయన సంప్రదాయంగా ధోవతి కట్టుకుని దర్శించుకున్నారు. అంతేకాదు శృంగేరీ పీఠాధిపతిని కూడా ఆయన కలుసుకున్నారు. బెంగళూరులోని దొడ్డగణపతి ఆలయం సహా పలు ఆలయాలను దర్శించారు. రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మంచి ఫలితాలే సాధించిన సంగతి తెలిసిందే. అందుకే.. ఇప్పుడు రాహుల్ ఏకంగా మానసరోవర్ యాత్రనే మొదలు పెట్టారు.  

గుజరాత్ ఎన్నికలతోనే రాహుల్ ఆలయ పర్యటలకు శ్రీకారం చుట్టారు. ఆ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మొత్తం 27 గుడులు తిరిగారు. నవంబరు 2, 2017న ఉనాయి మాతా ఆలయంతో మొదలుపెట్టిన ఆయన వరుసగా ఆలయాలకు వెళ్తూనే ఉన్నారు. ఆ ఏడాది డిసెంబరు 12న జగన్నాథ టెంపుల్ దర్శనంతో ఆ సిరీస్ ముగించారు.

అక్కడ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయినప్పటికీ ఆ కంచుకోటలో కాంగ్రెస్ పుంజుకొంది.  గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 99 సీట్లు సాధిస్తే కాంగ్రెస్ 77 సాధించింది. రాహుల్ 11 నియోజకవర్గాల్లోని ఆలయాలను సందర్శించగా అందులోని 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు