కేసీఆర్ తలుచుకుంటే అంతే మరి

కేసీఆర్ తలుచుకుంటే అంతే మరి

మ‌రో రోజులో కేసీఆర్ క‌ల మ‌రొక‌టి ఆవిష్కారం కానుంది. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఒక భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌టం. దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా ఈ స‌భ‌కు 25 ల‌క్ష‌ల మందిని తీసుకురావాల‌న్న ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించ‌టం.. ఈ దిశ‌గా ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయ‌టం తెలిసిందే.

యుద్ధ ప్రాతిప‌దిక‌న నిర్వ‌హిస్తున్న స‌భకు సంబంధించి కొత్త కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ స‌భ కోసం రూ.100 కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.. అంత‌కు మించే అన్న మాట తాజాగా వినిపిస్తోంది. కొంగ‌ర క‌లాన్ లో నిర్వ‌హిస్తున్న ప్ర‌గ‌తి నివేదిన స‌భ కోసం కేసీఆర్ ఖ‌ర్చు చేస్తున్న మొత్తంపై కొత్త మాట వినిపిస్తోంది.

ఈ బ‌హిరంగ స‌భ కోసం రూ.100 కోట్లు ఖ‌ర్చు అవుతున్న‌ట్లు లెక్క‌లు చెబుతున్నా.. అదంతా అబ‌ద్ధ‌మ‌ని..భారీగా జ‌రుగుతున్న ఏర్పాట్ల నేప‌థ్యంలో ఖ‌ర్చు లెక్క రూ.250 కోట్లుంగా ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌న‌స‌మీక‌ర‌ణ కోస‌మే దాదాపు రూ.100 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని.. మిగిలిన ఏర్పాట్ల‌కు మ‌రో రూ.150 కోట్లు అవ‌స‌ర‌మ‌వుతుంన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్లుగా స‌భ కోసం ఇచ్చిన ప్ర‌చార మెటీరియ‌ల్ లో డ‌బ్బుల క‌ట్ట‌లు ఉన్న‌ట్లు చెబుతున్నా అందులో నిజం లేదంటున్నారు. అయితే.. చేరాల్సిన రీతిలో నేత‌లకు భారీ మొత్తం చేతికి అందిన‌ట్లుగా చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ప్ర‌గ‌తి నివేదిన స‌భ కోసం భారీగా జ‌న‌స‌మీక‌ర‌ణ చేసేందుకు వీలుగా పార్టీ ఎమ్మెల్యేల‌కు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిన‌ట్లుగా తెలుస్తోంది.

త్వ‌ర‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తున్న వేళ‌.. ఆ భారం ఒక‌వైపు.. ప్ర‌గ‌తి నివేదన ఖ‌ర్చు నేత‌ల‌కు ఇబ్బందిక‌రంగా మారుతుంద‌ని.. అందుకే అలాంటి స‌మ‌స్య‌లు లేకుండా ఉండేందుకు వీలుగా పార్టీ ద‌న్నుగా నిలిచింద‌ని చెబుతున్నారు. ముంద‌స్తుకు సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న ఈ స‌భ ద్వారా చేయ‌ట‌మే కాదు.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో తాము సాధించిన విజ‌యాల్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల‌ర్ ఫుల్ గా చూపించ‌టం ఖాయ‌మని చెబుతున్నారు. ముంద‌స్తుకు మంచి ఆరంభంగా ప్ర‌గ‌తి నివేద‌న స‌భ జ‌ర‌గాల‌న్న‌దే కేసీఆర్ సంక‌ల్పంగా చెబుతున్నారు. అందుకే.. ఎవ‌రూ పెట్ట‌నంత భారీ బ‌డ్జెట్ తో ఈ స‌భ‌ను డిజైన్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. ఈ ఖ‌ర్చు లెక్క‌ల‌పై విపక్షాలు ఏమంటాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు