వామ్మో ఈ రాక్ష‌స‌త్వం ఏంది? ఎస్ఐ వీడియో చూశారా?..

వామ్మో ఈ రాక్ష‌స‌త్వం ఏంది?  ఎస్ఐ వీడియో చూశారా?..

విభేదాలు స‌హ‌జం. ఏదైనా గొడ‌వ‌లు వ‌స్తే స‌ర్దుకుపోయే ప్ర‌య‌త్నం చేయాలి. లేదంటే.. ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించాలి. తేడా చేస్తుంటే.. జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాలి. బాధ్య‌త క‌లిగిన స్థానంలో ఉండి.. విచ‌క్ష‌ణ‌ను కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. బ‌లుపు ప్ర‌ద‌ర్శించిన మ‌ణుగూరుఎస్ఐ స‌ముద్రాల జితేంద‌ర్ కు చెందిన తాజా వీడియో చూస్తే ఒళ్లు మండ‌క మాన‌దు.

క‌రీంన‌గ‌ర్ మొగిళ్ల‌పాడు గ్రామానికి చెందిన ఎస్ఐ జితేంద‌ర్ 2015లో వెంక‌టాపురంలో బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పాల్వంచ‌కు చెందిన ప‌ర్వీన్ ను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న వారం నుంచే భార్య‌ను వేధించ‌టం షురూ చేశాడు. త‌మ మ‌ధ్య గొడ‌వ‌ల గురించి ఎవ‌రికీ చెప్పొద్ద‌ని బెదిరించాడు.

పెళ్లి అయిన కొద్ది కాలానికే గ‌ర్బం దాల్చిన ప‌ర్విన్ కు బ‌ల‌వంతంగా గ‌ర్భ‌స్రావం చేయించాడు. ఆ త‌ర్వాత కొత్త‌గూడెంకు బ‌దిలీ అయిన స‌మ‌యంలో భార్య‌ను ప‌ట్టింటికి పంపాడు. రెండోసారి గ‌ర్భం దాల్చిన స‌మ‌యంలోనూ గ‌ర్భ‌స్రావం చేయించుకోవాల‌ని బ‌ల‌వంతం చేశాడు.

అందుకు ప‌ర్విన్ ఒప్పుకోక‌పోవ‌టంతో భార్య‌కు దూరంగా ఉంటున్నాడు. ప‌ర్విన్ ఫోన్ చేసినా రియాక్ట్ అయ్యేవాడు కాదు. ప‌ది నెల‌ల క్రితం కుమారుడు జ‌న్మించినా ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క‌సారి కూడా చూసేందుకు వెళ్ల‌లేదు. భార్య నుంచి విడాకులు కావాల‌ని ఒత్తిడి చేశాడు. ఒక మ‌హిళ‌తో ఉన్న వివాహేత‌ర సంబంధ‌మే దీనికి కార‌ణంగా అనుమానిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. త‌న‌ను దూరంగా ఎందుకు ఉంచుతున్నారంటూ భార్య‌.. ఆమె తల్లి.. బంధువులు మ‌ణుగూరులోని ఎస్ ఐ ఇంటికి వ‌చ్చి నిల‌దీశారు.

దీనికి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఎస్ఐ జితేంద‌ర్ వారిని విచ‌క్ష‌ణ‌ర‌హితంగా కొట్టారు. భార్య‌ను.. అత్త‌ను దారుణంగా కొట్టిన వైనాన్ని స్థానిక మీడియా ప్ర‌తినిధులు వీడియో తీశారు. భ‌ర్త చేతిలో దెబ్బ‌లు తిన్న‌భార్య‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై కేసు న‌మోదైన‌ట్లుగా స్థానిక డీఎస్పీ చెబుతున్నారు. భార్య‌పైనా.. అత్త‌పైనా మ‌ణుగూరు ఎస్ ఐ ఆరాచ‌క దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. వీడియోను చూస్తున్న ప్ర‌తి ఒక్క‌రు.. భార్య‌పై ఇంత దారుణంగా దాడి చేస్తారా? అన్న మాట ప్ర‌తిఒక్క‌రి నోటి నుంచి వ‌స్తోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు