మొన‌గాడు మోడీ.. రూపాయి విలువ కాపాడ‌లేరా?

మొన‌గాడు మోడీ.. రూపాయి విలువ కాపాడ‌లేరా?

మోడీని ప్రేమించే వారు.. అభిమానించే వారు ఆయ‌న్ను త‌మ మాట‌ల‌తో త‌ర‌చూ ఆకాశానికి ఎత్తేస్తుంటారు. నాలుగున్న‌రేళ్ల కాలంలో ఆయ‌న దేశానికి ఏం చేశార‌న్న మాట ఎవ‌రి నోటి నుంచైనా వ‌చ్చిందంటే చాలు.. వెంట‌నే చెల‌రేగిపోతారు. అవినీతి మ‌చ్చ లేనోడు మా మోడీ అనేస్తారు. మ‌రి.. రాఫెల్ మాట‌? అని ప్ర‌శ్నిస్తే.. ప్ర‌తిప‌క్షాల కుట్ర‌గా కొట్టేస్తారు. మ‌రింత లోతుల్లోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తే.. యాంటీ మోడీనా? అంటూ మూతి ముడిచేయ‌ట‌మే కాదు.. 60 ఏళ్లు దేశాన్ని నాశ‌నం చేసింది చాల‌దా? ఇంకా.. నాశ‌న‌మైపోవాల‌నుకుంటున్నారా? అంటూ తిట్ల వ‌ర్షం కురిపించ‌టం స్టార్ట్ చేస్తారు.

అరే.. ఎక్క‌డ మొద‌లెట్టి ఎక్క‌డికి వెళుతున్నార్రా బాబు అన‌బోతుండ‌గానే.. మోడీ అవ‌స‌రం దేశానికి ఎంత ఉంద‌న్న విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. మీరు చెప్పింది స‌రే.. పెద్ద‌నోట్ల ర‌ద్దు  నిర్ణ‌యం ఎందుకంత అట్ట‌ర్ ప్లాప్ అయ్యిందంటారు? అన్న ప్ర‌శ్న‌కు మ‌రింత చికాకు ప‌డుతుంటారు.

నిజ‌మే.. క‌ఠిన‌మైన నిజాల్ని ప్ర‌శ్నిస్తే ఎవ‌రికైనా ఫ‌స్ట్రేష‌నే వ‌స్తుంది. తాము అధికారంలోకి వ‌స్తే లీట‌రు పెట్రోలు రూ.50కు తీసుకురావ‌టం పెద్ద విష‌య‌మే కాద‌న్న‌ట్లు చెప్పిన మాట‌కు భిన్నంగా ఇప్పుడు 80కి తీసుకెళ్లిన ఘ‌నత మోడీ ఖాతాలోనే వేయాలి. ఇవ‌న్నీ ఒక ఎత్తు.. డాల‌రుతో రూపాయి మార‌కం విలువ‌ను జీవిత‌కాలం గ‌రిష్ఠానికి చేర్చిన రికార్డు మోడీ ఖాతాలో ప‌దిలంగా ఉంటుంద‌ని చెప్పాలి.

అంత‌కంత‌కూ ప‌డిపోతున్న రూపాయిని కాపాడే మొన‌గాడి త‌త్వం మోడీలో ఎందుకుక‌నిపించ‌టం లేద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానాలు రావు స‌రిక‌దా.. ఇదే త‌ర‌హా ఎత్తిపొడుపులే దేశాన్ని నాశ‌నం చేస్తున్నాయి?  అయినా.. ప్ర‌పంచంలో ఏదో జ‌రిగిన దానికి రూపాయి ప్ర‌భావితం అయితే.. ఆ విష‌యాన్ని మోడీకి లింకు పెడ‌తారా? అంటూ ప్ర‌శ్నించ‌టం క‌నిపిస్తుంది. మొన్న‌నే డాల‌రుతో రూపాయి మార‌కం విలువ 70 ట‌చ్ చేస్తే..అయ్యో అనుకున్నంత‌లోనే మ‌రో రూపాయి ఢ‌మాల్ అంటూ రూ.71కుచేరుకుంది.

రికార్డు స్థాయిలో ప‌డిపోతున్న రూపాయి మార‌కం విలువ ఆందోళ‌న‌ను రేకెత్తిస్తోంది. డాల‌రుకు పెరుగుతున్న డిమాండ్ తో పాటు.. ముడిచ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో డాల‌ర్ కుప‌ట్ట‌ప‌గ్గాలు ఉండ‌ని ప‌రిస్థితి. నిన్న‌టికి నిన్న సెష‌న్ లో రూ.70.74 వ‌ద్ద ముగిసిన డాల‌ర్ మార‌కం విలువ ఈ రోజు ఆరంభంలోనే రూ.70.95కు మొద‌లై.. కాసేప‌టికే రూ.71ను ట‌చ్ చేసింది.  అమెరికా.. చైనాల మ‌ధ్య వాణిజ్య భ‌యాలు కూడా దేశీయ క‌రెన్సీ మీద ప్ర‌భావాన్ని చూపుతున్నాయ‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం రూపాయి మార‌కం విలువ రూ.70.94 వ‌ద్ద ట్రేడ్ అవుతుంది. చూస్తుంటే.. మోడీ హ‌యాం పూర్తి అయ్యే నాటికి రూపాయి విలువ భారీగా ప‌డిపోవ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ప్లీజ్ మోడీ మీ మొన‌గాడిత‌నం ప్ర‌ద‌ర్శించి..రూపాయికి ర‌క్ష‌కుడిగా మారొచ్చు క‌దా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు