మ‌హామ‌హులు వెంట రాగా.. చివరి యాత్ర !

మ‌హామ‌హులు వెంట రాగా.. చివరి యాత్ర !

ఒక ఆవేశం చల్లారింది. ఒక ఆవేదన మూగబోయింది. ఒక ఆప్యాయత కనుమరుగైంది. మూగ జీవాల ప్రేమికుని మాట మూగబోయింది. దివంగత ము‌ఖ్యమంత్రి, మ‌హా నటుడు నందమూరి తారక రామారావు కుమారుడు, నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరిక్రిష్ణ రోడ్డు ప్రమాదంలో కాలం చేశారు. ఆయన పార్థివ‌ దేహాన్ని నగర వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. బుధవారం ఉదయం మరణించిన హరిక్రిష్ణ భౌతిక దేహాన్ని సందర్శించేందుకు అభిమానులు, తెలుగుదేశం నాయకులు , ప్రజల సందర్శనార్థం  ఆయన ఇంట్లో ఉంచారు. బుధవారం ఉదయం నుంచి వందలాది మంది రాజకీయ నాయకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు భౌతిక దేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. బుధవారం ఉదయం నుంచి హరిక్రిష్ణ అంతిమ క్రియలు పూర్తి అయ్యే వరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హరిక్రిష్ణ బావ నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లకుండా హరిక్రిష్ణ ఇంటి దగ్గరే ఉన్నారు. చివరికి హరిక్రిష్ణ పాడెను కూడా ఆయనే మోయడం విశేషం.

చంద్రబాబు నాయుడికి మరోవైపు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పాడెను ఎత్తుకున్నారు. హరిక్రిష్ణతో జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉంది. తన మిత్రుడి రుణాన్ని ఈ విధంగా తీర్చుకుని వారిద్దరి మైత్రికి న్యాయం చేశారు జాస్తి చలమేశ్వర్. ఇంతకు ముందు ఎన్నడూ చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద వారు మరణించినా అక్కడికి వెళ్లి నివాళులర్పించే వారే కాని పాడె మోయడం వంటివి చేయలేదు. ఈసారి మాత్రం తన బావమరిది హరిక్రిష్ణ పాడెను ఆయనే స్వయంగా భుజానికెత్తుకోవడం విశేషం.

 గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన హరిక్రిష్ణ అంతిమ యాత్ర ఆయన ఇంటి నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో వందల మంది కార్యకర్తలు, స్నేహితులు, బంధువులు, ప్రజలు పాల్గొన్నారు. అంతిమయాత్ర దారిపొడుగునా ప్రజలు హరిక్రిష్ణకు అంతిమ వీడ్కోలు పలికారు. దారి పొడుగునా ఆయన అభిమానులు, ప్రజలు హరిక్రిష్ణకు నీరాజనాలు పలికారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న మహాప్రస్థానం శ్మశానవాటికలో హరిక్రిష్ణ పార్థివ దేశం ఉన్న చితికి ఆయన కుమారుడు కల్యాణ్ రామ్ అంతిమ సంస్కారం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు