మోడీ టీంను కేసీఆర్ హైజాక్ చేసిన‌ట్లే!

మోడీ టీంను కేసీఆర్ హైజాక్ చేసిన‌ట్లే!

కొద్ది రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓ ఎపిసోడ్ గుర్తుండే ఉంటుంది. ఆధ్యాత్మికవేత్త‌, స్వామి పరిపూర్ణానంద న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ ఉదంతం క‌ల‌క‌లం సృష్టించింది. ఆయ‌న విష‌యంలో  తెలంగాణ సీఎం కేసీఆర్ క‌ఠిన వైఖ‌రి అవ‌లంబించార‌ని బీజేపీ ఆరోపించింది. ప‌రిపూర్ణానంద‌ స్వామి విషయంలో మాట్లాడేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వమంటే సీఎం కేసీఆర్ నిరాకరించారు. క‌ట్ చేస్తే... తాజాగా మంగళవారం రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ స‌మావేశం ఎక్క‌డ జ‌రిగిందంటే...ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాస‌మైన ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో. ఓవైపు ప్ర‌గ‌తి నివేద‌న స‌భ పేరుతో కీల‌క‌మైన స‌మావేశంలో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ...కేసీఆర్ బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌డం వెనుక లాజిక్ ఏంట‌నే ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో మోడీ టీంను కేసీఆర్ ప్యాక్ చేసేశార‌ని అంటున్నారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో బీజేపీ నేతలు సీఎంను కలిసినట్టు చెబుతున్నా.. అంతకు మించి రాజకీయ కారణాలే వారి భేటీకి కారణమని తెలుస్తోంది. ముందస్తు ములాఖాత్‌లో భాగంగా ప్రధాని మోడీతోపాటు ఇతర బీజేపీ పెద్దలతో సమావేశమై తిరిగొచ్చిన సీఎం కేసీఆర్ బీజేపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ముంద‌స్తులో ఓ భాగ‌మేనా? అనే చ‌ర్చ కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. అంతేకాకుండా ప‌లు ర‌కాల చ‌ర్చ‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. బీజేపీ అధిష్టానం సూచనల మేరకే కేసీఆర్‌.. రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారనే వాదన కూడా వినిపిస్తోంది. ఢిల్లీలో ప్ర‌ధాని మోడీతోపాటు ఇతర మంత్రులు, నాయకులతో చర్చల సందర్భంగా ముందుకొచ్చిన అంశాలను సీఎం రాష్ట్ర బీజేపీ నేతలకు వివరించినట్టు సమాచారం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇరు పార్టీల మధ్య సఖ్యత నానాటికీ పెరుగుతున్న క్రమంలో ముందస్తు ఎన్నికలొస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్‌, బీజేపీలు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి? ఎక్కడెక్కడ పోటీ చేయాలి? ఏయే స్థానాల్లో పోటీలను నివారించుకోవాలి? అనే అంశాలపై ఆయన సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. ఒకవేళ సాధారణ ఎన్నికలకే వెళ్లాల్సి వస్తే అప్పుడేం చేయాలి? అనే విషయాలపై కూడ ఆయన ప్రాథమికంగా చర్చించినట్టు సమాచారం.

కాగా, ఈ ప‌రిణామాన్ని బీజేపీలోని కొంద‌రు నేత‌లు ఇంకో రీతిలో విశ్లేషిస్తున్నారు. ఇటీవ‌ల పార్టీ నేత‌లు కేసీఆర్ గురించి ఢిల్లీ నాయ‌కుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. 'ఇక్కడ మేం కేసీఆర్‌ను పదేపదే విమర్శిస్తుంటాం. ఆయన ఢిల్లీ రాగానే మీరు సమయమిచ్చి ఎర్ర తివాచీ పరుస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో మాకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఆయన మమ్మల్ని అసలు లెక్కలోకి కూడా తీసుకోడు...' అంటూ రాష్ట్ర బీజేపీ నేతలు తమ అధిష్టానం ముందు వాపోయినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వారి కోపాన్ని తగ్గించటంతోపాటు సంతృప్తి పరిచేందుకే కేసీఆర్‌ ప్రత్యేకంగా వారితో సమావేశమైనట్టు పేర్కొంటున్నారు. అయితే, త‌మ భేటీవిష‌యంలో...రాజ‌కీయాల‌కు తావులేద‌ని బీజేపీ నేత‌లు చెప్తుండ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు