డ్రైవర్ హరికృష్ణ‌

డ్రైవర్ హరికృష్ణ‌

డ్రైవర్ హరికృష్ణ‌ ఇలా పిలిపించుకోవడం ఆయనకు ఎంతో ఇష్టం. తన జీవితంలో ఎక్కువ సమయాన్ని ఆయన వాహనంలోనే గడిపారు. కార్లన్నా, లాంగ్‌ డ్రైవ్ ల‌న్నా హరికృష్ణ‌కు చాలా ఇష్టం.


ఇరవై ఏళ్లకే స్టీరింగ్ పట్టుకున్న హరికృష్ణ‌ ఎంతో అద్భుతమైన డ్రైవర్‌ అని ఆయన తండ్రి, మహానటుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు బహిరంగంగా చెప్పేవారు. ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు వ్యక్తిగత డ్రైవర్ హరికృష్ణే.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు చేసిన రాష్ట్ర పర్యటనలో అన్న‌గారి `చైత‌న్య ర‌థా`నికి ర‌థ సార‌ధి హరికృష్ణే. వేల కిలోమీటర్లు అలుపూ సొలుపూ లేకుండా తండ్రికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా డ్రైవింగ్ చేశారు హరికృష్ణ‌. ఆ చైతన్య ర‌థ సారధిగా హరికృష్ణ‌ తప్ప వేరేవరూ పనికిరారని నందమూరి తారక రామారావు తన సన్నిహతుల వద్ద చెప్పేవారట.

వేల కిలోమీటర్లు నడిపినప్ప‌టికీ హరికృష్ణ‌ మొహంలో అలసట కనిపించేది కాదని ఎన్టీఆర్ అనేవారు. తన తండ్రిని చూసేందుకు రోడ్డుకు అటూ ఇటూ కొన్ని చోట్ల రోడ్డు పైనే వేలాదిమంది అభిమానులున్నప్ప‌టికీ వారెవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హరికృష్ణ  చైతన్య రథాన్ని నడిపేవారు. ఈ పర్యటనలో అలసిపోయావా అని, మరొక డ్రైవర్ని ఏర్పాటు చేసుకుందామా అని తండ్రి నందమూరి తారక రామారావు ఎన్నిసార్లు అడిగినా ఆయన నుంచి నో అనే సమాధానం వచ్చేదని అంటారు.

దీనికి కారణం తన డ్రైవింగ్ పట్ల నమ్మకం ఒకటైతే తండ్రి ఎన్టీఆర్ పట్ల తీసుకున్న జాగ్రత్త మరొకటని సన్నిహితులు చెప్తారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావ‌డానికి ముందు, ఆయన పదవి నుంచి దింపేంత వరకూహరికృష్ణ‌ తన తండ్రి వెంటే ఉండేవారు. ఆయన అడుగులో అడుగు వేసేవారు. తారకరామారావు ముఖ్యమంత్రి అయ్యాక కూడా కొన్ని ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్లాలంటే సొంత కారులో హరికృష్ణ  డ్రైవింగ్‌లో వెళ్లేవారు.

హరికృష్ణ‌ డ్రైవింగ్ పట్ల ఎన్టీఆర్ కున్న నమ్మకం అంత గొప్పది. నందమూరి కుటుంబంలో ఏ కార్యక్రమమైన హరికృష్ణే సారధ్య బాధ్యతలు తీసుకునే వారు. మిగిలిన సోద‌రులు అక్కచెల్లెళ్లు కూడా హరికృష్ణ‌కే అన్ని బాధ్యతలు అప్పగించేవారు. దీనికి కారణం హరికృష్ణ‌లోని నిజాయితీ, ముక్కుసూటితనమే అని అంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు