సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసింది హరికృష్ణ ఒక్కరే..

సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసింది హరికృష్ణ ఒక్కరే..

రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో సమైక్యాంధ్ర కోసం ఏపీ ఎంపీలు ఎంత పోరాటం చేసినా ఎవరూ కూడా రాజీనామా చేయలేదు. సమైక్యాంధ్ర కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఘనత ఒక్క హరికృష్ణకే దక్కింది. ఉద్యమం ఉదృతంగా సాగుతున్న ఆ సమయంలో పార్టీకి కానీ, తన సహచర ఎంపీలకు కానీ ఏమాత్రం చెప్పకుండా హరికృష్ణ హఠాత్తుగా రాజీనామా చేశారు.  2013 ఆగస్గు 22న ఆయన అప్పటి  ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛెయిర్మన్ హమీద్ అన్సారీని కలిసి రాజీనామా సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌ను విభజించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని.. తాము ఎంతగా అభ్యంతరం వ్యక్తంచేస్తున్నా వినిపించుకోవడం లేదని.. అందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించి ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసేందుకు నిర్ణయించుకుని హమీద్ అన్సారీని కలవడానికి వెళ్లినప్పుడు రాజ్యసభ ప్రాంగణంలోనే మిగతా టీడీపీలు ఎంపీలు విభజనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. కానీ, వారెవరూ హరికృష్ణ రాజీనామా సంగతి తెలుసుకోలేకపోయారు. ఆయనలోని నిజాయితీ చూసో ఏమో కానీ రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న హమీద్ అన్సారీ ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించారు.

రాజీనామా సమర్పించి వచ్చిన తరువాత ఆయన సభలో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ ఆయన ప్రతి తెలుగోడికి అర్థమయ్యేలా రాజ్యసభలో తెలుగులో ఆవేశపూరితంగా మాట్లాడారు. అప్పటికి రాజ్యసభలో తెలుగు నుంచి హిందీ లేదా ఆంగ్లానికి అనువాదం లేకపోవడంతో.. సభాపతి ఆ విషయం చెప్పినా ఆయన వినకుండా తెలుగులోనే మాట్లాడి ఆవేశంగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన రాజీనామా చేసినట్లు సభలో డిప్యూటీ ఛెయిర్మన్  కురియన్ ప్రకటించే సొంత పార్టీ పెద్దలకు కానీ, సభలో ఉన్న సొంత పార్టీ నేతలకు కానీ తెలియకపోవడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు