రెడ్డి.. మరీ ఇంత చీప్‌గానా?

రెడ్డి.. మరీ ఇంత చీప్‌గానా?

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయ్ సాయిరెడ్డి ఆ పార్టీలో ఉన్న ప్రాధాన్యమెలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు నుంచే జగన్‌‌కు పెద్ద అండగా ఉంటూ వస్తున్నాడు విజయ్ సాయిరెడ్డి. జగన్ వ్యాపార, రాజకీయ కార్యకలాపాల్లో ఆయన పాత్ర చాలా కీలకం అని అందరికీ తెలుసు.

ఆయన్ని ఒక మాస్టర్ మైండ్‌గా.. మేధావిగా అభివర్ణిస్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు. ఐతే ఇంతకుముందు తెర వెనుకే ఉండిపోయిన విజయ్ సాయిరెడ్డి.. తర్వాత తెరముందుకు వచ్చారు. ఎంపీ అయ్యారు. కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడి వార్తల్లో నిలిచారు.

జగన్‌లో అప్పుడప్పుడూ కనిపించే అసహనం ఆయనలోనూ కనిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఒక ఎంపీ పార్లమెంటు ముందు నిలుచుని ఒక ముఖ్యమంత్రి గురించి ఇంత చీప్‌గా మాట్లాడటమా అంటూ విజయ్ సాయిరెడ్డిపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

తాజాగా విజయ్ సాయిరెడ్డి చర్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. తన ట్విట్టర్ అకౌంట్లో ఒక మీమ్‌ను షేర్ చేశారాయన. చంద్రబాబును.. ఆయన తనయుడు నారా లోకేష్‌ను కించ పరిచేలా ఉన్న మీమ్ అది. ఎవరో ఆకతాయిలు మార్ఫింగ్ చేసి చీప్‌గా తయారు చేసిన మీమ్ అది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం ఘోరంగా ఓడిన వెంటనే నారా లోకేష్ తమ పార్టీ అమెరికాలో ఎలా అధికారంలోకి రావాలో ఆలోచిస్తుంటాడని.. మరి చంద్రబాబు ఏ దేశానికి అధ్యక్షుడు కావాలనుకుంటున్నారని ప్రశ్నించి.. కింద స్విట్జర్లాండ్, సింగపూర్, మలేసియా, జపాన్ అంటూ ఆప్షన్లిచ్చారు.

సోషల్ మీడియాలో ఇలాంటి చీప్ మీమ్స్ చాలానే ఉంటాయి. జగన్ మీద కూడా ఇలాంటివి తెలుగుదేశం మద్దతుదారులు రూపొందిస్తారు. ఇలాంటివి సామాన్యులు తయారు చేసి ప్రచారం చేస్తే ఓకే అనుకోవచ్చు కానీ.. ఒక ఎంపీగా గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి చీప్ వ్యవహారాలు ఎవ్వరూ ఊహించరు. ఇలాంటివి ఏ పార్టీ వాళ్లు చేసినా తప్పే. విజయ్ సాయి లాంటి వ్యక్తి ఈమాత్రం కామన్ సెన్స్ ఎలా మిస్సయిందో? ఈయన్ని  మేధావి అని.. మాస్టర్ మైండ్ అని వైకాపా వాళ్లు ఎలా చెప్పుకుంటారో?