ముందస్తు... ఖాయమస్తు...

ముందస్తు... ఖాయమస్తు...

శషబిషలు లేవు. అనుమానాలు లేవు. అభ్యంతరాలు లేవు. అపోహలూ లేవు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై స్పష్టత వచ్చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండు రోజుల ఢిల్లీ పర్యటనతో ముందస్తుకు శుభం కార్డు పడిపోయింది.

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా హోం మంత్రి, ఇతర ఉన్నతాధికారులను కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు సూత్రప్రాయ అంగీకారాన్ని తెచ్చుకున్నట్లు సమాచారం. ఇక మిగిలిందిల్లా తెలంగాణ శాసనసభను రద్దు చేయడం ఒక్కటే. సెస్టెంబర్ రెండవ తేదీన జరిగే ప్రగతి నివేదిక సభలో ముదస్తుపై మరింత స్పష్టమైన నిర్ణయాన్ని
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు.

ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తెలంగాణలో ముందస్తుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో వివరించారు. ముందస్తుకు వెళ్లడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా మేలు జరుగుతుందని ఆయన అన్నట్లు చెబుతున్నారు. తెలంగాణతో పాటు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న మూడు రాష్ట్రాల్లో ప్రజల
నాడి తెలుసుకునే అవకాశం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి తెలిసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రధానికి వివరించినట్లు చెబుతున్నారు.

ఈ వాదనతో అంగీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందస్తుకు ఏర్పాట్లు చేసకోండంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణలో ముందస్తుకు వెళ్లడం వెనుక అసలు కారణం గ్రామప్ధాయిలో తెలంగాణ రాష్ట్ర సమితిపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని పార్టీ సర్వేలో తేలింది. ఇది మరింత పెరగకుండా ముందుగానే ఎన్నికలు వెళ్లి దాని తీవ్రత తెలిసే లోపు
విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావాలన్నది కె.చంద్రశేఖర రావు ఎత్తుగడగా చెబుతున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బస్సు యాత్రలు, ప్రజల్లోకి వెళ్లేందుకు పలు కార్యక్రమాలు చేపట్టే అవకాశాలున్నాయని, ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితికి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు  తక్కువగానే ఉంటాయని కె.చంద్రశేఖర రావు భావిస్తున్నారు. దీనిని ద్రష్టిలో ఉంచుకునే ముందస్తుకు ఆయన తొందర పడుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎవరి అభిప్రాయాలు, ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం ముందస్తు ఎన్నికలకు ముహూర్తం నిర్ణయించడమే మిగిలింది. ఇది సెప్టెంబర్ నెల మొదటి వారంలో తేలిపోనుంది.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు