పవన్‌తో పొత్తు వద్దు

పవన్‌తో పొత్తు వద్దు

జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గడచిన నాలుగైదు నెలలుగా వామపక్షాలకు చెందిన నాయకులు జనసేనాని పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నారు. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సిపీఎం అయితే ఆ విషయాన్ని బహిరంగంగానే చెబుతోంది. సిపీఐ మాత్రం లోలోపల జనసేనకు మద్దతు తెలుపుతున్నా బయటకు మాత్రం కొన్నాళ్లు వేచి చూడాలనే ధోరణిలోనే ఉంది. సీపీఎం, సీపీఐలకు చెందిన అగ్ర నాయకుల మనసులో జనసేనతో కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని ఉన్నా ఆ పార్టీలకు చెందిన కిందిస్ధాయి నాయకులు, కార్యకర్తలు, మేథావులు మాత్రం పవన్ కల్యాణ్ తో పొత్తుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం.

పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బలం కేవలం ఆయన అభిమానులే అని, వారిలో సగానికి పైగా ఓటర్ల కాదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పైగా ఇంతకు ముందు ప్రజారాజ్యం పార్టీతో ప్రజల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి పట్ల తెలుగు ప్రజల్లో మంచి అభిప్రాయం లేదని,  ఆ ఎన్నికల్లో చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ తన అన్న తరఫున తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి
ప్రచారం కూడా చేశారని వారంటున్నారు.

అయితే ఆ ఎన్నికలు, అనంతర పరిణామాలతో చిరంజీవి, ఆయన కుటుంబం పట్ల తెలుగు వారిలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనే విషయాన్ని వామపక్షాల అగ్ర నాయకులు గుర్తు చేసుకోవాలని ఆ పార్టీలకు చెందిన మేథావులు పేర్కొంటున్నారు. సినిమా వారిని నమ్ముకుని ఎన్నికలకు వెళ్తే పార్టీకి ఉన్న మంచి పేరు ప్రజల్లో పోతుందని కూడా వారంటున్నారు.

"వామపక్షాలకు ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకునే శక్తి లేదు. అయితే ప్రజల్లో మాత్రం ఈ పార్టీల పట్ల ఇంకా నమ్మకం ఉంది" అని సిపిఎంకు చెందిన సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఆ పరువు, పేరులను ఇప్పుడు పవన్ కల్యాణ్ కోసం వదులుకోవడం ఏమంత శ్రేయస్కరం కాదన్నది క్షేత్ర స్ధాయి నాయకులు, కార్యకర్తలు, మేథావుల అభిప్రాయంగా ఉంది. వీరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తుపై తగిన నిర్ణయం తీసుకోవాలని వారంటున్నారు. ఇప్పుడు కలిసి ఎన్నికల అనంతరం ఆయన భారతీయ జనతా
పార్టీతో జత కడితే ఇన్నాళ్లూ వామపక్షాలకు ఉన్న పేరు పోతుందని వారు హెచ్చరిస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు