తొడకొడుతున్న కాంగ్రెస్

తొడకొడుతున్న కాంగ్రెస్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దమవ్వడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సిద్దమవుతోంది. ఈ ఎన్నికలలో గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సర్వశక్తులు ఓడుతోంది. ముందస్తుకు మేము కూడా సిద్దమంటూ జబ్బ చరుస్తోంది.

ఇప్పటికే వ్యూహ రచనలో దిట్ట అని పేరున్న గులాం నబీ ఆజాద్‌ను ఎన్నికల సమరానికి ముందే తెలంగాణలో మోహరించనుంది. ఇక జాతీయ స్దాయి సీనియర్ నాయకులందరూ తెలంగాణ వైపే చూస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రత్యేక తెలంగాణను ప్రకటించి ఇక్కడి నుంచే తమ పతనాన్ని లిఖించుకున్న కాంగ్రెస్ తిరిగి ఇక్కడి నుంచే తన ప్రాభావాన్ని పెంచుకోవాలనుకుంటోంది. ఇందుకు అనుగుణంగా చకచక పావులు కదుపుతోంది.

ఢిల్లీలో ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ముందస్తుకు అడుగులు వేస్తుంటే మరోవైపు అదే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు వ్యూహ రచన చేయడం గమనార్హం. ప్రజలలో వ్యతిరేకత కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి ముందస్తుకు వెళ్తున్నారని భావిస్తున్న కాంగ్రెస్ ఇదే అంశాన్ని ప్రజలలోకి తీసుకుని వెళ్లాలని భావిస్తోంది.

ముందస్తు ఎన్నికలలో మొదటి చర్యగా సెప్టెంబర్ తొలివారంలోనే అభ్యర్దుల ఎంపిక పూర్తి చేయాలనుకుంటోంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ ఒక్కో జాబితాను రూపొందిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నాయకులు ఇచ్చే జాబితాను కాచి వడపోసి చివరిగా కాంగ్రెస్ అధిష్టానం తుది జాబితాను ఖరారు చేస్తుంది.

తొలి జాబితాలో 60 నుంచి 80 మంది అభ్యర్దులను ప్రకటించాలనుకుంటున్నారు. ఈ జాబితాలో ప్రకటించిన అభ్యర్దులపై వచ్చే  స్పందనను బట్టి మిగిలిన స్దానాలలో అభ్యర్దుల జాబితాని ప్రకటించాలని కాంగ్రెస్ భావన. సీనియర్ నాయకులలో విబేధాలు పరిష్కరించి అందరినీ ఒక తాటిపైకి తీసుకుని రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

ఇందుకోసం సీనియర్ నేతల మధ్య సమన్వయం తీసుకోచ్చేందుకు జాతీయ నాయకులను రంగంలోకి తీసుకురావాలనుకుంటోంది. ఇక సెటిలర్ల ఓట్లే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులను తెలంగాణలో మోహరించాలనుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేయనుంది.  

తెలంగాణ లోని సెటిలర్లను ప్రత్యేక హో దా నినాదంతో ఆకట్టుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ జనతా పార్టీతో దగ్గరవ్వడం తమకు అనుకూలించే అంశంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఎప్పటి నుంచో మైత్రి బంధం కొనసాగిస్తున్న మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ కు సహకరిస్తుందని అధిష్టానం ఆలోచన.

ఒకవైపు భారతీయ జనతా పార్టీతోను మరోవైపు మజ్లిస్ తో నడవాలని కేసీఆర్ పన్నుతున్న వ్యూహాన్ని ఎదురు దెబ్బ తప్పదని కాంగ్రెస్ నాయకులు నమ్ముతున్నారు. బిజేపీ, టీఆర్‌ఎస్‌లకు మధ్య ఉన్న ర‍హస్య ఒప్పందాన్ని బహిరంగపరిస్తే మైనారిటీలు తమవైపే ఉంటారని కాంగ్రెస్ నమ్మిక. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు