100 ప్ర‌చార స‌భ‌లు...101సీట్లు...50 రోజులు

100 ప్ర‌చార స‌భ‌లు...101సీట్లు...50 రోజులు

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ముంద‌స్తు అన్నే మ‌చ్చ‌ట‌ను నేరుగా చెప్ప‌క‌పోయినా...ఎన్నికుల అయితే సిద్దంగా ఉండాల‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. ఎన్నిక‌ల‌కు సంబంధించిన బాధ్య‌త‌లు త‌న‌కు అప్ప‌గించాల‌ని పేర్కొంటూ ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం తెలంగాణ‌భ‌వ‌న్‌లో గురువారం జ‌రిగింది. ఈ సమావేశానికి హాజ‌రైన‌ టీఆర్ఎస్ నేత‌ల‌ను ఉద్దేశించిన కీల‌క అంశాల‌పై స్ప‌ష్ట‌త ఇచ్చారు. సెప్టెంబర్ 2న నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ, తదితర అంశాలపై సమావేశంలో చర్చించిన కేసీఆర్ 50 రోజుల పాటు 100 ప్ర‌చార స‌భ‌ల్లో తాను పాల్గొంటాన‌ని ప్ర‌క‌టించారు, 101 సీట్లలో గెలుపు త‌మ‌మ‌దేన‌ని జోస్యం చెప్పారు.

దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రగతి నివేదన సభ విజయవంతం కావాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణుల‌కు స్ప‌ష్టం చేశారు. వేల సంఖ్యలో బస్సులు, ప్రైవేటు వాహనాలు, కార్లు, ట్రాక్టర్లను జన సమీకరణకు వినియోగించాలని ఆయ‌న హిత‌బోధ చేశారు. జనసమీకరణకు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా వాహనాలను తెప్పించుకోవాలని కేసీఆర్ సూచించ‌డం గ‌మ‌నార్హం.  ప్రగతి నివేదన సభలో భేరీ మోగిద్దామని కేసీఆర్ పార్టీ నేతలతో అన్నారు. ఈ  సభకు 25 లక్షల మంది హాజరవుతారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న అన్ని స్థానాలూ  గెలుస్తామని పార్టీ నేతల వద్ద ఈ సందర్భంగా కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ మొదటి వారంలో అభ్యర్థులను ఖరారు చేస్తామ‌ని కేసీఆర్ తెలిపారు. సిట్టింగ్ అభ్య‌ర్థుల‌కు సీట్లు ఖాయ‌మ‌ని పేర్కొంటూ...త‌ప్ప‌నిస‌రి అయితేనే, అభ్య‌ర్థుల‌ను మార్చుతామ‌న్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చేదీ తనకు కూడా తెలియదని, ఎప్పుడైనా జరగొచ్చని, పార్టీ నేతలంతా సిద్ధంకావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 101 శాసనసభా స్థానాల్లో విజయం మనదేన‌ని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. 50 రోజుల పాటు ప‌ర్య‌టించి 100 స‌భ‌ల్లో తాను ప్ర‌సంగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు, పొత్తుల దిశగా రాష్ట్ర రాజకీయం పరుగులు తీయనుందంటున్నారు. కాగా, టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం అనంతరం నేరుగ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలవనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English