జ‌మిలీ ఎన్నిక‌లు అయ్యే ప‌ని కాద‌ని తేల్చేశారు

జ‌మిలీ ఎన్నిక‌లు అయ్యే ప‌ని కాద‌ని తేల్చేశారు

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జమిలి ఎన్నికల ప్రక్రియకు తెర‌ప‌డింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి జరుగుతాయంటూ కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. జమిలి ఎన్నికలు సాధ్యంకాదని ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) ఓపీ రావత్ తేల్చిచెప్పారు. చట్టపరమైన ఏర్పాటు లేనంతవరకు జమిలి ఎన్నికలు జరిగే అవకాశం లేదని స్పష్టంచేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగనున్నాయి. అయితే, వచ్చే ఏప్రిల్-మే నెలల్లో లోక్‌సభతోపాటే ఈ నాలుగు రాష్ర్టాల ఎన్నికలు నిర్వహిస్తారంటూ కొద్ది వారాలుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటికి రావత్ తెరదించారు.

జమిలి ఎన్నికలు జరిగే అవకాశమే లేదని సీఈసీ రావత్ ఔరంగాబాద్ కుండబద్దలు కొట్టారు. ``జమిలి ఎన్నికలపై పార్లమెంట్‌లో బిల్లును ప్రతిపాదించాలి. దానిపై చర్చ జరిగి, సభ ఆమోదం పొందాలి. చివరగా అది చట్టం రూపు సంతరించుకోవాలి. ఇందుకు కనీసం ఏడాది అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మా పని ప్రారంభమవుతుంది`` అని చెప్పారు. ఈవీఎంల పనితీరుపై విమర్శలను ప్రస్తావించగా.. ఈవీఎంలలో కేవలం 0.5 నుంచి 0.6 శాతం వైఫల్యం ఉంది. మొత్తంగా చూసినప్పుడు ఇది ఆమోదయోగ్యమేనని అన్నారు.

కొద్దికాలం క్రిత‌మే రావ‌త్ త‌మ వైఖ‌రిని స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.  లోక్‌సభతోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని కాషాయ పార్టీ పెద్దలు గత కొద్దిరోజులుగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్నినెలల ముందు.. కొన్ని నెలల తర్వాత ఎన్నికలు జరుగాల్సిన రాష్ర్టాల అసెంబ్లీల కాలపరిమితిని పెంచడం లేదా తగ్గించడం ద్వారా జమిలి ఎన్నికలు నిర్వహించాలని, ఆయా రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉండటంతో ఎటువంటి రాజ్యాంగ సవరణ, చట్టపరమైన ప్రక్రియ అవసరం లేదని ఇన్నాళ్లూ కమలం పార్టీ భావించింది. లోక్‌సభతోపాటు 11 రాష్ర్టాలకు ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలుపుతూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా లా కమిషన్‌కు నివేదిక ఇచ్చిన మ‌రుస‌టి రోజే సీఈసీ ఈ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ మేర‌కు మ‌రోమారు ఆయ‌న క్లారిటీ ఇవ్వ‌డంతో జ‌మిలీ లేద‌నే స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు