ఇలంటి కామెడీ మాట‌లు ఎందుకు

ఇలంటి కామెడీ మాట‌లు ఎందుకు

ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆ రాష్ట్రంలో `ప్ర‌త్యేక గుర్తింపు` పొందిన నాయ‌కుల్లో ఒక‌రు. అడ్ర‌స్ గ‌ల్లంతు అయిపోయి ఆగ‌మాగంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్లు ఎవ‌రూ లేన‌ప్ప‌టికీ...ప్ర‌జ‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోన‌ప్ప‌టికీ..ర‌ఘువీరా పార్టీ రాష్ట్ర ర‌థ‌సార‌థిగా త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. ఇలా మొండిధైర్యంతో ముందుకు సాగ‌డం అభినంద‌నీయ‌మే. అయితే అలాంటి గుర్తింపు ద‌క్కించుకున్న రఘువీరా తాజాగా చేసిన కామెంట్ ఏపీ మొత్తాన్ని న‌వ్విస్తోంద‌ని అంటున్నారు. ఆ రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసిన ర‌ఘువీరా వ్యాఖ్య ఏంటంటే...కాంగ్రెస్ వైపే ప్ర‌జ‌లంతా చూస్తున్నారట‌. అంతేకాదు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాల‌ని ప్రజలు కోరుకుంటున్నారట‌!

రాష్ట్ర విభజన అనంతరం పూర్తిగా కాంగ్రెస్ ఛాయలు ఏపీలో కనుమరుగైపోయిన విషయం తెలిసిందే. పునర్‌వైభ‌వం కోసం కాంగ్రెస్ నానా తంటాలు పడుతోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేపథ్యంలో ఇటీవ‌ల త‌న సంస్థాగ‌త కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా ర‌ఘువీరా మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుండి ఏపీలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని, కర్నూల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రఘువీరా తెలిపారు. 2019 ఎన్నికలను దృష్టి పెట్టుకొని తాము ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నామ‌న్నారు.  జాతీయ అధ్యక్షడు రాహుల్ గాంధీ పర్యటన ద్వారా తిరిగి  బ‌లం పుంజుకుంటామ‌ని, ఏపీలో నెలకు ఒకసారి రాహుల్‌ పర్యటించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్ర‌జ‌లంతా త‌మ పార్టీ అధికారంలోకి రావాల‌ని చూస్తున్నార‌ని కర‌ఘువీరా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తులు పెట్టుకోం-రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమని ఆయ‌న అన్నారు.

ఏపీలో పునర్‌వైభవం కోసం కాంగ్రెస్‌ కసరత్తును ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌న‌ప్ప‌టికీ... ప్రజలు అంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నంత సీన్ నిజంగా ఉందా అంటే...కాంగ్రెస్ పార్టీలోని నాయ‌కులే న‌మ్మే ప‌రిస్థితి లేదు. అలాంట‌ప్పుడు ర‌ఘువీరా ఇలంటి కామెడీ మాట‌లు ఎందుకు మాట్లాడుతార‌ని ప‌లువురు బ‌హిరంగంగానే చ‌ర్చించుకుంటున్నారు.ఇక కాంగ్రెస్-టీడీపీల పొత్తు గురించి ఆయ‌న మాట‌లు విశ్లేషిస్తే...ఢిల్లీ పెద్ద‌ల‌తో టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు చేసుకుంటున్న లాబీయింగ్ విష‌యంలో ఇంకా అప్‌డేట్ కాలేద‌నే విష‌యం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు