మోడీ..కేర‌ళ‌ను దొంగ‌దెబ్బ తీస్తున్నారా?

మోడీ..కేర‌ళ‌ను దొంగ‌దెబ్బ తీస్తున్నారా?

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీపై క‌మ్యూనిస్టులు, వారి సానుభూతిప‌రులు భ‌గ్గుమంటున్నారు. సిద్ధాంత‌ప‌రంగా ఎలాగూ వారు విమ‌ర్శిస్తారు, ఆరోపిస్తారు అనే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దానికి తోడుగా మోడీ చేసిన ప‌నికి, చేయాల‌ని అన‌కుంటున్న ప‌నికి వామ‌ప‌క్ష నేత‌లు విరుచుకుప‌డుతున్నారు. మోడీ నేరుగా చేయ‌కుండా దొంగ‌దెబ్బ తీస్తున్నార‌ని ఆక్షేపిస్తున్నారు. ఇదంతా ప్రకృతి విపత్తులో అతలాకుతలమైన కేర‌ళ గురించి. స‌మాఖ్య స్ఫూర్తితో ఉదారంగా ఆర్థిక చేయూతనందించి అండగా నిలువాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకపోగా కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తున్నారు. కేరళీయుల కన్నీటి కష్టాలకు చలించి మానవతా హృదయంతో రూ.700 కోట్ల బూరి విరాళం అందజేసేందుకు ముందుకొచ్చిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ)ని అడ్డుకొంటామని మోడీ ప్రభుత్వం సంకేతాలిస్తోందని అయితే ఇది నేరుగా చేయ‌కుండా త‌న మార్కును చాటుకుంటోంద‌ని మండిప‌డుతున్నారు.

దేవ‌భూమి అయిన కేర‌ళ వ‌ర‌ద‌ల ముప్పున‌కు తీవ్ర విపత్తును ఎదుర్కున్న సంగ‌తి తెలిసిందే. ఈ క‌ష్టం నుంచి తేరుకోవడంలో భాగంగా పునరావాస, పునిర్నిర్మాణ పనులకు రూ.700 కోట్లు ఆర్థిక సహాయం అందిస్తామని యుఎఇ ప్రకటించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. యుఎఇతో కేరళకు ప్రత్యేక ఆత్మీయ సంబంధముందని, మళయాళీలు దూరంగా ఉన్న సొంత ఇంటిలా భావిస్తారని పేర్కొన్నారు. విపత్తు సమయంలో ఉదారంగా స్పందించినందుకు యుఎఇకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ సహాయాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుమతించకపోవచ్చని అత్యంత ఉన్నతస్థాయి వర్గాలు మీడియాకు లీకులు ఇచ్చాయి. `ఏ దేశమైనా సరే, విదేశాల నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని కేంద్రం ఇప్పటి వరకు అంగీకరించలేదు. యూఏఈ ప్రకటించిన సాయం విషయంలోనూ ఇదే జరగవచ్చు` అని మంత్రి వర్గ స్థాయి అధికారి ఒకరు తెలిపిన‌ట్లు మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖదే తుది నిర్ణయంగా ఉంటుందని సదరు అధికారి పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ విషయమై ప్రతిపాదన కానీ, ఆఫర్‌ కానీ తమ ముందుకు రాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కాగా, ఈ ప‌రిణామంపై కేర‌ళీయులు ఫైర్ అవుతున్నారు. కావాల‌నే త‌మ‌ను ఆదుకునే ప్ర‌క్రియ‌కు ప్ర‌ధాని మోడీ అడ్డుప‌డుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున‌ స‌హాయం చేయాల్సింది పోయి...వ‌స్తున్న విరాళాల‌ను సైతం ఆగిపోయేలా దొంగ‌దెబ్బ తీస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. కేర‌ళ‌ను ప‌రిపాలిస్తున్న‌ది క‌మ్యూనిస్టు నాయ‌కుడు కావ‌డంతో స‌హ‌జంగానే దేశ‌వ్యాప్తంగా ఉన్న వామ‌ప‌క్ష భావ‌జాల వాదులు సైతం దీంతో ఏకీభ‌విస్తున్నారు. స‌హాయం చేయాల్సిన టైంలో మోడీ రాజ‌కీయం ఆయ‌న‌కు మ‌చ్చ తెస్తుంద‌నేది కాద‌న‌లేని కొందరి వాద‌న‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు