ఏ పార్టీ పిలవడం లేదనేనా ‘కొత్తపల్లి’ కొత్త పార్టీ?

ఏ పార్టీ పిలవడం లేదనేనా ‘కొత్తపల్లి’ కొత్త పార్టీ?

గత ఎన్నికల్లో అరకు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి కిశోర్ చంద్రదేవ్ వంటి ఉద్ధండుడిపై భారీ మెజారిటీతో గెలిచిన కొత్తపల్లి గీత కొద్దిరోజులకే వైసీపీని వీడి టీడీపీ వైపు కదిలారు. తరువాత ఆ పార్టీకి కూడా దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం బీజేపీలో చేరాలనే ప్రయత్నం చేసినా అదీ ఫలించలేదు. ఈలోగా అనేక కేసులు.. వివాదాలు.

వీటన్నిటితో ఏ పార్టీ కూడా ఆమె వైపు చూడలేదు. దీంతో ఏ పార్టీకి చెందని నేతగా ఆమె మిగిలిపోయారు. దీంతో కొద్దినెలలుగా ఆమె కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. తాజాగా ఆమె పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించడమే కాకుండా శుక్రవారం దీనిపై పూర్తి వివరాలు చెప్తానన్నారు.

శుక్రవారం విజయవాడలో తన కొత్త రాజకీయ పార్టీని గురించి అధికారికంగా వెల్లడిస్తానని  ఆమె ప్రకటించారు.  వారసత్వం ఉన్నవారికే గుర్తింపు, పదవులు వస్తున్నాయని, ప్రతిభ ఉన్న యువతకు, విద్యావంతులకు, మహిళలకు, మేధావులకు రాజకీయ రంగంలో తగిన గుర్తింపు లభించడం లేదని, వారిని ఎదగనీయడం లేదని గీత అంటున్నారు.

ఉత్తరాంధ్ర ఏజెన్సీలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టిన ఆమెకు ఆ ప్రాంతంలో నెట్వర్క్ ఉంది. దీంతో ఏజెన్సీ వరకు ఆమె అభ్యర్థులను నిలబెట్టినా ఓట్లు చీలే అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రాంతం వరకు ప్రభావితం చేసేలా రాజకీయ పార్టీ నడిపేందుకు ఆమె వద్ద భారీగా డబ్బుందని... ఏపీలో ఇప్పటికే పార్టీలు ఎక్కువైన నేపథ్యంలో ఆమె రాజకీయ పార్టీ పెడితే ఈ ఎన్నికల్లో కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికైనా ఆమె అవసరం మిగతా పార్టీలకు ఉండొచ్చన్న ఉద్దేశంతోనే పార్టీ పెడుతున్నట్లు సమాచారం.

మరోవైపు ఏ పార్టీలోకి వెళ్లేందుకు కూడా అవకాశం లేక దారులు మూసుకుపోవడంతో ఆమె తానే స్వయంగా కొత్త పార్టీ పెడుతున్నారన్న సెటైర్లూ వినిపిస్తున్నాయి.  కాగా.... ఓ ప్రముఖ తెలుగు చానల్‌కు చెందిన వ్యక్తి ఒకరు గీతకు, బీజేపీ నేతలకు మధ్య వారధిగా ఉన్నారని... బీజేపీ నేతలు ఆయన ద్వారా గీతతో పార్టీ పెట్టిస్తున్నారన్న టాక్ ఒకటి బలంగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English