ముందుకెళ్తే భయం... వెనక్కొస్తే అపజయం

ముందుకెళ్తే భయం... వెనక్కొస్తే అపజయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఎన్నికల ఫీవర్ ముంచెత్తుతోంది. ఎన్నికల విషయంలో ఏం చేయాలో తెలియక ఆయన సతమతమవుతున్నారు.
ఎన్నికల్లో తమదే విజయమని గంభీరంగా చెబుతున్నా ఓటమి భయం మాత్రం ఆయనను వెంటాడుతున్నట్లే కనపడుతోంది.

గత నెల రోజులుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు రాష్ట్రంలో ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు కూడా వాటి గురించే మాట్లాడేలా ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఆయన మనసులో ఏముందో మాత్రం బయటకు తెలియనివ్వడం లేదు.  ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం హడావుడిగా మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ మంత్రివర్గ సమావేశంలో దీనిపై స్పష్టత వస్తుందని అందరూ భావించారు.

అయితే, ఇందుకు విరుద్ధంగా మంత్రివర్గ సమావేశంలో ఆయన ఏమీ తెల్చకుండా ముగించేశారు. ఇంతకీ ఆయన మనసులో ఏముందో మాత్రం బయటపెట్టలేదు. ముందస్తు ఎన్నికలంటే
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు భయపడుతున్నారని ఓ వర్గం చెబుతోంది. దీనికి కారణం లేకపోలేదు. దేశవ్యాప్తంగా ఒకే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా ఇక్కడే తిష్ట వేస్తుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు సీనియర్ నేతలందరూ తెలంగాణ జిల్లాల్లో విస్త్రతంగా పర్యటిస్తారు. మీడియా కూడా కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయన
పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ప్రచారం ఇస్తుంది. దీంతో మీడియా పరంగా కెసీఆర్ అండ్ కో వెనుకబడతారు. ఇది విజయావకాశాలను దెబ్బతీస్తుందని కెసీఆర్ భయపడుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఇక యథాప్రకారం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుంది. దీంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఏకం అయ్యే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే తనకు, తెలంగాణ రాఫ్ట్ర సమితికి తీవ్ర నష్టం జరుగుతుంది. దీన్ని ద్రష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటున్నారు. హడావుడి మంత్రివర్గ సమావేశంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కేవలం ప్రగతి నివేదన సభకే పరిమితమైనట్లు చెబుతున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఎన్నికలంటే భయపడుతున్నారని అర్ధం అవుతోంది.