సేవ్ చేయమని పిలిచి సెల్ఫీ తీసుకున్నాడు

సేవ్ చేయమని పిలిచి సెల్ఫీ తీసుకున్నాడు

సెల్ఫీల పిచ్చి చాలామందిని తామేం చేస్తున్నామో కూడా అర్ధం కానంతగా చేస్తుంది. సెల్ఫీల మోజులో పడి గాయపడుతున్నవారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి గురించి నిత్యం వార్తల్లో వస్తోంది. ఒక్కోసారి కొందరి సెల్ఫీల పిచ్చి మిగతా చాలామందిని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే... ఏ పని చేసినా సమయం సందర్భం చూసుకోవాలంటారు.

సెల్ఫీ తీసుకోవడం తప్పేమీ కాకపోయినా దానికీ ఒక సందర్భం.. పరిస్థితులు అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తాజాగా కేరళ వరదల్లో బాధితులకు సహాయం అందించేందుకు, కాపాడేందుకు వెళ్లిన సైనికులు, రెస్క్యూ టీంలకు ఇలాంటి టిపికల్ సెల్ఫీరాయుళ్లు తగిలారట.

అలాంటి ఓ సెల్ఫీ రాయుడు చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే.... వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు హెలికాప్టర్లలో తరలిస్తున్న సైన్యానికి ఒక చోట ఎర్ర చొక్కా గాల్లో ఊపుతూ రక్షించమంటూ కేకలేస్తున్న యువడొకరు కనిపించారు. అది చూసిన సైన్యం పాపం.. ఎంత కష్టంలో ఉన్నాడో అనుకుని హెలికాప్టర్ ‌తో అతన్ని చేరింది.

అతన్ని రక్షించడానికి పైలట్ అతి కష్టంతో హెలికాప్టర్ ని అతని సమీపంలోకి తీసుకొచ్చాడు. అయితే... ఆ కుర్రాడు అప్పుడేం చేశాడో తెలుశా..? హెలికాప్టర్ అతని దగ్గరకు వెళ్ళగానే పాకెట్ నుండి మొబైల్ బయటకు తీసి సెల్ఫీ తీసుకున్నాడు. అంతేకాకుండా తన సెల్ఫీ అయిపోగానే ఇక మీరు వెళ్లొచ్చు అని హెలికాప్టర్ లో వచ్చిన సైనికులతో చెప్పాడట.

ఈ సంగతి తెలిసిన ప్రజలు ఇలాంటివారి వల్ల నిజంగా ప్రమాదంలో ఉన్నవారిని కాపాడలేని పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఆ సమయంలో ఇంకొకరిని సైన్యం కాపాడి ఉండేదని అంటున్నారు. మరికొందరైతే... ఆ యువకుడు చేసిన పనిని కోపగించుకుంటూ అలాంటి వాడిని తీసుకెళ్లి ఇడుక్కి డ్యాంలో దించేయాల్సిందని కామెంట్ చేస్తున్నారు.