మంత్రుల‌కు కేసీఆర్ "అర్జెంట్" ఫోన్ కాల్స్‌!

మంత్రుల‌కు కేసీఆర్

సాధార‌ణంగా ముఖ్య‌మంత్రిని ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండా నేరుగా క‌లిసే చ‌నువు రాష్ట్ర మంత్రుల‌కు ఉంటుంది. మామూలు స‌మ‌యాల సంగ‌తి ఎలా ఉన్నా.. ముఖ్య‌మైన స‌మ‌యాల్లో మంత్రులు సీఎంల‌ను త‌ర‌చూ క‌లుస్తుంటారు. కానీ.. కేసీఆర్ స్కూల్ కాస్త వేరుగా ఉంటుంది. మంత్రులు త‌న‌ను ఎప్పుడు క‌ల‌వాలో ఆయ‌నే డిసైడ్ చేస్తారు. ఒక‌వేళ‌.. ఎవ‌రైనా మంత్రి ఇలాంటివి పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా త‌ర‌చూ సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళితే.. ఊహించిన షాకులు ఎదుర‌వుతాయి.

మొద‌ట్లో ఇద్ద‌రు ముగ్గురు మంత్రులు అదే ప‌నిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌లిసే ప్ర‌య‌త్నం చేసేవారు. వారేమాత్రం ఊహించ‌నిరీతిలో పంచ్ లు ప‌డ్డాయ‌ని చెబుతారు. దీంతో.. వారు ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వెళ్ల‌ట‌మే బంద్ చేసిన‌ట్లుగా చెబుతారు. ఈ కార‌ణంతోనే.. మంత్రులు క‌ల‌వాల‌నుకునే సంద‌ర్భాల్లో ముఖ్య‌మంత్రే వారిని పిలిపిస్తార‌ని చెబుతారు. తాజాగా.. సీఎం పేషీ నుంచి మంత్రుల‌కు ఒక అర్జెంట్ కాల్ వెళ్లింది. ఎందుకంటే.. అత్య‌వ‌స‌ర భేటీ పేరుతో స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.

బుధ‌వారం సాయంత్రం జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రులంతా హాజ‌రు కావాల‌న్న‌విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పారు. సీఎంవోకు చెందిన అధికారులు తామే వ్య‌క్తిగ‌తంగా ప్ర‌తి ఒక్క మంత్రితో మాట్లాడి.. ముఖ్య‌మైన విష‌యాలు ఉన్నాయ‌ని.. త‌ప్ప‌నిస‌రిగా మీటింగ్ కు రావాల‌న్న సీఎం సందేశాన్ని వారికి అందించిన‌ట్లుగా చెబుతున్నారు. ఉన్న‌ట్లుండి ఎందుకింత అర్జెంట్ గా మంత్రుల్ని పిలిపించి ఉంటార‌న్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. అర్జెంట్ స‌మావేశానికి కార‌ణం ప‌లు అంశాల ఎజెండా ఉంద‌ని చెబుతున్నారు.

ముంద‌స్తు ఎన్నిక‌లు (కేసీఆర్ దృష్టిలో ముందుస్తు కావ‌నుకోండి) మీద చ‌ర్చ‌తో పాటు.. అభ్య‌ర్థుల ఎంపిక‌.. త్వ‌ర‌లో చేప‌ట్టే భారీ నిర్మాణ అంశాల‌తో పాటు.. రాష్ట్ర ప్ర‌గ‌తికి సంబంధించిన అంశాలు కూడా చ‌ర్చిస్తార‌ని చెబుతున్నారు. వీలైనంత‌వ‌ర‌కూ రాజ‌కీయ అంశాలే అర్జెంట్ భేటీలో ఉంటాయ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ముంద‌స్తుపై మంత్రుల అభిప్రాయాల్ని ఆయ‌న తీసుకోనున్న‌ట్లుగా తెలుస్తోంది.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలంగాణ‌లో పొత్తులు ఉంటాయ‌న్న మాటను ఓపెన్ గా చెప్పిన నేప‌థ్యంలో ఆ  అంశంపైనా చ‌ర్చ జ‌ర‌గ‌టం ఖాయం. బాబు ప్ర‌క‌టించిన‌ట్లు తెలంగాణ‌లో పొత్తు పెట్టుకుంటే..  ఆ ప్ర‌భావం టీఆర్ఎస్ మీద ప‌డ‌కుండా ఉండ‌టానికి వీలుగా ఎలాంటి వ్యూహాలు అనుస‌రించాలో చెబుతార‌ని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఎన్నిక‌ల‌కు సంబంధించిన కీల‌క అంశాల మీద‌నే అర్జెంట్ స‌మావేశంలో ప్ర‌ధాన అంశాలు అవుతాయ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు