"దేశం" పొత్తుల కుండ బద్దలు

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పొత్తుల కుండ బద్దలు కొట్టింది. ఇక్కడ ఎవరో ఒకరితో పొత్తు ఖాయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతే కాదు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో కూడా ఆయన అంచ‌నా వేసే ప్ర‌య‌త్నం చేశారు.

తెలంగాణలో  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీ కూడా పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించారు. తెలంగాణలో ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలో అక్కడి నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన తర్వాత నిర్ణయిస్తామని కూడా చంద్ర‌బాబు ప్రకటించారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర  సమితి, భారతీయ జనతా పార్టీ పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు అంచనా వేస్తున్నారు.

అలా కాని పక్షంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక్క స్ధానం కూడా రాదన్నది ఆయన అభిప్రాయం. అలా అయితే తాము కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందని ఆయన మాటలను బట్టి తెలుస్తుంది. తెలంగాణలో ఉన్న సెటిలర్ల ఓట్లపైనే అందరి కళ్లు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. దీని ప్రభావం తెలంగాణలో ఉన్న సెటిలర్లపై ఉంటుంది. దీంతో తాను కాంగ్రెస్‌తో కలిస్తే లాభం ఉంటుందనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. ఒకరు రాష్ట్రానికి అన్యాయం చేశారని, మరొకరు ఇప్పుడున్యాయం చేస్తామంటున్నారని, ఈసారి వారిని నమ్ముదామని పార్టీ అగ్ర నాయకులతో చంద్రబాబు నాయుడు అన్నట్లు సమాచారం.

అంటే నర్మగర్భంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుద్దాం అని ముఖ్యమంత్రి చెప్పారని అంటున్నారు. ఇక తెలంగాణలో వామ పక్షాల పరిస్ధితి ఏమిటీ, కొత్తగా ఏర్పాటైన కోదండరాం పార్టీ పరిస్థితి ఏమిటనే దానిపై కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడి నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. మిగిలిన వారు ఎలా ఉన్నా కాంగ్రెస్‌తో మాత్రం విధిగా కలిసి పొటీ చేయాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచన. ఇదే విషయాన్ని ఆయన పార్టీ సహచరులు, మంత్రివర్గ సహచరుల వద్ద స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ఏమంత బాగోలేదని, వారికి 170 కంటే ఎక్కువ స్ధానాలు లేవని రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ అంచనా వేసారు. దీంతో అదే జరిగితే కేంద్రంలో మరోసారి తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పవచ్చునని సిఎం రమేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్పష్టం చేశారు. దీనిపై కూడా చంద్రబాబు నాయుడు సమాలోచనలు చేసినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు