మంచి నిర్ణ‌యం... రాజ‌ధాని పేరు మార్చారు

మంచి నిర్ణ‌యం... రాజ‌ధాని పేరు మార్చారు

బీజేపీ దిగ్గజం, ఇటీవల మరణించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పేరు ఇక ఒక రాష్ట్రంలో జనం నోట నిత్యం నాననుంది. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తమ రాష్ట్ర రాజధాని నయా రాయపూర్‌కు అటల్ పేరు పెట్టాలని నిర్ణయించింది. ఇకపై నయా రాయపూర్ పేరు అటల్ నగర్ గా మార్చాలని నిర్ణయం తీసుకుంది.

చత్తీస్‌గఢ్ ఏర్పాటులో వాజ్‌పేయి చేసిన మేలును తామెప్పటికీ మర్చిపోలేమని, అందుకే రాజధాని పేరును అటల్ నగర్‌గా మార్చి స్మరించుకోవాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తెలిపారు. అలాగే, బిలాస్‌పూర్ యూనివర్సిటీ, నయారాయ్‌పూర్‌లోని జాతీయ పార్కు, రాజ్‌నందగావ్ వైద్యశాలకు కూడా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలోని పోలీసు బెటాలియన్ పేరును ఫోఖ్రాన్ బెటాలియన్‌గా మార్చనున్నట్టు తెలిపారు.

వాజ్‌పేయిని గుర్తు చేసుకోవడంలో మరికొన్ని రాష్ట్రాలు కూడా ముందుకొస్తున్నాయి. స్మారకాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిషికేష్‌లోని ఆడిటోరియానికి వాజ్‌పేయి పేరు పెట్టాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే, మహారాష్ట్రలోని స్టడీ సర్కిళ్లు కూడా అటల్ పేరుపై మారిపోనున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు