కేర‌ళ ఇష్యూలో ఏ సీఎం చేయ‌ని ప‌ని చేసిన బాబు

కేర‌ళ ఇష్యూలో ఏ సీఎం చేయ‌ని ప‌ని చేసిన బాబు

టైమింగ్ అంటే ఇలానే ఉండాలన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ప్ర‌కృతి విల‌యంతో కేర‌ళ అత‌లాకుత‌ల‌మైన వైనం దేశీయంగానే కాదు.. అంత‌ర్జాతీయంగా ప‌లువురిని క‌దిలిస్తోంది. అర‌బ్ దేశాల అధినేత‌లు సైతం త‌మ వంతుగా కేర‌ళ‌కు సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు.

కేర‌ళ‌కు అవ‌స‌ర‌మైన ఆర్థిక సాయాన్ని త‌మ వంతుగా ప్ర‌క‌టిస్తూ.. మ‌ల‌యాళీల‌కు తాము అండ‌గా ఉన్నామ‌న్న భ‌రోసాను ఇస్తున్నారు. మ‌రి.. ఇంత‌టి స్పంద‌న వ‌స్తున్న వేళ‌.. ప్ర‌ధాన‌మంత్రిగా మోడీ మ‌రెంత బాధ్య‌త‌గా వ్య‌వ‌హరించాలి. దాదాపుగా రూ.2ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా న‌ష్టం వాటిల్లిన కేర‌ళ క‌ష్టానికి మోడీ ప్ర‌క‌టించిన సాయం రూ.600 కోట్ల‌కు దాట‌ని ప‌రిస్థితి. రాష్ట్రాల‌కు చేయూత‌ను ఇచ్చే విష‌యంలో పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన కేంద్రం.. తాజా ఎపిసోడ్లో దారుణంగా వ్య‌వ‌హ‌రించింద‌ని చెప్పాలి.

విశాఖ హూధూద్ విల‌యంపైనా మోడీ ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి. అంతులేని న‌ష్టం జ‌రిగిన విశాఖ‌.. ప‌రిస‌ర ప్రాంతాల‌కు రూ.1000 కోట్లు మాత్ర‌మే ప్ర‌క‌టించ‌టంపై అప్ప‌ట్లో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఇదిలా ఉంటే.. పేరుకు వెయ్యి కోట్లు ప్ర‌క‌టించి.. చివ‌ర‌కు రూ.650 కోట్లు మాత్ర‌మే ఇచ్చిన తీరును ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు.

తాజాగా కేర‌ళ ఎపిసోడ్లోనూ మోడీ ఇదే తీరులో ప్ర‌క‌టించ‌టంపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ప్పు ప‌ట్టారు. వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన రాష్ట్రాంలోని ప్ర‌స్తుత ప‌రిస్థితిని జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ బాబు సంచ‌ల‌నం సృష్టించారు.

దేశంలో ఇంత‌మంది సీఎంలు ఉన్నా.. మ‌రే సీఎం ప్ర‌ద‌ర్శించ‌ని చొర‌వ‌ను చంద్ర‌బాబు చేశార‌ని చెప్పాలి. త‌న‌కు సంబంధం లేకున్నా.. ఒక రాష్ట్రం విష‌యంలో మోడీ స‌రిగా రియాక్ట్ కాని వైనాన్ని వేలెత్తి చూప‌ట‌మే కాదు.. మ‌రింత సాయం అందించాల్సిన బాధ్య‌త కేంద్రానికి ఉంద‌ని చెప్ప‌టం ద్వారా మోడీని ఇరుకున ప‌డేశార‌ని చెప్పాలి.

కేంద్రాన్ని మ‌రింత సాయం అందించాల‌ని కోరే క్ర‌మంలో తమ వంతుగా తాము చేసిన సాయాన్ని బాబు చెప్ప‌టం చూసిన‌ప్పుడు మోడీ ఎలా వ్య‌వ‌హ‌రించారో ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి. కేర‌ళ‌కు ఏపీ స‌ర్కారు రూ.10 కోట్ల ఆర్థిక సాయంతో పాటు.. కేర‌ళ సీఎం కోరిక మేర‌కు రూ.6 కోట్ల విలువైన బియ్యాన్ని పంపుతున్న‌ట్లు చెప్పారు. ఇక ఎన్జీవోలు.. జేఎసీ.. పెన్ష‌న‌ర్లు.. స‌చివాల‌యం ఉద్యోగుల జేఏసీ క‌లిసి రూ.24 కోట్లు.. పోలీసు అధికారులు.. ఉద్యోగులు రూ.7 కోట్లు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. రూ.2.5 కోట్లు ప్ర‌క‌టించిన‌ట్లు వెల్ల‌డించారు. అంటే.. ఏపీ వ‌ర‌కూ చేసిన సాయం లెక్క చూస్తే.. రూ.49.5కోట్లు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇది ప్రైవేటు వ్య‌క్తుల‌ను మిన‌హాయించి. ఈ లెక్క‌న కేంద్రం కేర‌ళ‌కు మ‌రెంత సాయాన్ని ప్ర‌క‌టించాలంటారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు