మోడీ మైండ్ బ్లాంక‌య్యే స‌ర్వే రిపోర్ట్ వ‌చ్చింది

మోడీ మైండ్ బ్లాంక‌య్యే స‌ర్వే రిపోర్ట్ వ‌చ్చింది

2019 ఎన్నిక‌ల‌కు వ్యూహాలు ర‌చిస్తూ...అన్నీ క‌లిసి వ‌స్తే ముంద‌స్తుకు వెళ్లాల‌ని చూస్తున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని బీజేపీకి షాకిచ్చే స‌ర్వే వెలుగులోకి వ‌చ్చింది. రాబోయే ఎన్నిక‌ల‌వైపు దూకుడుగా ముందుకు సాగుతున్న ఆ పార్టీ మ‌రీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఉండ‌వ‌ద్ద‌నే సిగ్న‌ల్ స్ప‌ష్టమైంది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా పూర్తిస్థాయి మెజార్టీ సాధించిన బీజేపీకి.. తక్షణం ఎన్నికలు నిర్వహిస్తే సొంతంగా మెజార్టీ రాదని ఓ సర్వేలో వెల్లడైంది. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మాత్రం మెజార్టీ స్థానాలను సాధిస్తుందని ఆ సర్వే స్పష్టంచేసింది.

2019 ఎన్నికల్లో ఎన్డీయేకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని, అన్ని రికార్డులను తాము బద్ధలు కొడతామని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవ‌ల ఓ పత్రికకు ప్రత్యేకంగా ఇచ్చిన‌ ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ``గతంలో ఎన్డీయేకు ఎప్పుడూ రానన్ని సీట్లు ఈసారి గెలుస్తాం. గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయి. ప్రజలు మాతోనే ఉన్నారు. మేము దేనికీ భయపడటం లేదు`` అని మోడీ అన్నారు.

అయితే మోడీ స‌హా ఆయ‌న టీం అప్‌సెట్ అయ్యే రిపోర్ట్ ఇండియాటుడే-కార్వీ ఇన్‌సైట్స్ సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో  లోక్‌సభకు తక్షణం ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే ఫలితాలపై సర్వేను నిర్వహించాయి. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

బీజేపీకి సొంతంగా మెజార్టీ రాదని.. 245 సీట్లు మాత్రమే వస్తాయని.. మెజార్టీ కోసం ఆ పార్టీ ఎన్డీయే పక్షాలపై ఆధారపడాల్సిందేనని సర్వే తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ అన్ని పక్షాలను కలుపుకుని మహాకూటమి ఏర్పాటు చేస్తే బీజేపీ ఓటమి ఖాయమని తేలింది.

మరోవైపు ప్రధానమంత్రి అభ్యర్థిగా మాత్రం ప్రస్తుత ప్రధాని మోడీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. మళ్లీ మోడీయే ప్రధాని కావాలని 49 శాతం మంది ప్రజలు కోరుకుంటుండగా.. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని 27 శాతం మంది కోరుకుంటున్నారు.

ఇదిలాఉండ‌గా...2014 ఎన్నికల్లో బీజేపీకి 282 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. 1984 తర్వాత ఒకే పార్టీకి సంపూర్ణ మెజార్టీ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే రాబోయే ఎన్నిక‌ల్లో మోడీకి వ్య‌తిరేకంగా ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు పావులు క‌దుపుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తోంది. మోడీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న  కాంగ్రెస్ దేశంలో మైనార్టీలు, దళితులపై జరుగుతున్న దాడులు మోడీ చరిష్మాను తగ్గించాయని బ‌లంగా న‌మ్ముతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు