బీజేపీలోకి స్టార్ క్రికెట‌ర్...అక్క‌డి నుంచే పోటీ

బీజేపీలోకి స్టార్ క్రికెట‌ర్...అక్క‌డి నుంచే పోటీ

ఓవైపు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఆయా పార్టీలు అంత‌ర్గ‌త వ్యూహాల‌ను ప‌దునుపెడుతుంటే మ‌రోవైపు కొత్త నేత‌లు సైతం తెర‌మీద‌కు వస్తున్నారు. వివిధ రంగాల్లో రాణించిన నాయ‌కులు ఇప్పుడు రాజ‌కీయాల్లో దున్నేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఈ జాబితాలో చేరారు. కొన్నాళ్లుగా టీమ్‌కు దూరంగా ఉంటున్న గంబీర్‌  రాజకీయాల్లోకి వస్తుండ‌ట‌మే కాకుండా వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడ‌ని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయ‌న‌కు అధికార బీజేపీ వెల్‌కం చెప్తోంద‌ని, కీల‌క‌మైన ప్రాంతం నుంచి బ‌రిలో దింప‌నుంద‌ని అంటున్నారు.

జాతీయ భావాలు, దేశభక్తి ఎక్కువగా ఉండే గంభీర్‌కు భారతీయ జనతా పార్టీ తమ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నది. దేశానికి సంబంధించి ఏ అంశంపై అయినా స్పందించడానికి గంభీర్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈ విషయంలో గంభీర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. ఇది తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్న బీజేపీ.. గౌత‌మ్‌ను బరిలోకి దింపడానికి సిద్ధమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచే గంభీర్‌ను బరిలోకి దింపాలని బీజేపీ చూస్తుంద‌ని స‌మాచారం. అయితే గంభీర్ ప్రస్తుతానికి ఇంకా అధికారికంగా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించలేదు. అతనికి ఎలాగూ మళ్లీ టీమ్‌లో చోటు దక్కే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. దీంతో రాజకీయాలపై దృష్టిసారించాలని అతడు నిర్ణయించుకున్నాడని స‌మాచారం. 36 ఏళ్ల గౌతీ.. 2011 వరల్డ్‌కప్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. గంభీర్ తన కెరీర్‌లో మొత్తం 58 టెస్టులు, 147 వన్డేలు ఆడాడు. ఇప్పటికే అజారుద్దీన్, సిద్ధూలాంటి క్రికెటర్లు రాజకీయాల్లో ఉన్నారు. అజర్ గతంలో ఎంపీగా చేయగా.. సిద్ధూ ప్రస్తుతం పంజాబ్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు