కేరళ కకావికలం...

కేరళ కకావికలం...

భారీ వర్షాలకు కేరళ కకావికలం అవుతోంది. గడచిన వందేళ్ల చరిత్రలో ఎన్నడూ చూడనంత విలయం అక్కడ తాండవిస్తోంది. గడచిన పది రోజులుగా కేరళను వర్షాలు అతలాకుతలం చేస్తున్నారు. ఈ వర్షాలకు రాష్ట్రంలో దాదాపు 350 మంది మరణించారు.

ఒక్క గురువారం నాడే దాదాపు వంద మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కేరళ మొత్తం వర్షంలో తడిసి ముద్దవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో వరద బీభత్సం విలయతాండవం చేస్తోంది. పర్యాటక రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న కేరళకు పర్యాటకులు ఎవరూ రావద్దంటూ అక్కడి ప్రభుత్వం వినతి చేసింది.

రాష్ట్రంలోని ప్రధాన నదులన్నీ దారుణంగా ఉన్నాయి. కాలువలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని 35 ప్రాజెక్టు డ్యాంల గేట్లు ఎత్తివేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కేరళీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. కష్ట కాలంలో సాయం చేయాల్సిన కేంద్రం మాత్రం ఇంత వరకూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. శనివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలో ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఈ సర్వే అనంతరమైనా కేరళకు కేంద్రం సాయం అందిస్తుందేమోనని ఆ రాష్ట్ర ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

కేరళలో దశాబ్దాలుగా వామపక్ష కూటమి అధికారంలో ఉంది. అక్కడ ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది భారతీయ జనతా పార్టీ కల. నిజానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. కర్నాటకలో అధికారంలోకి వచ్చినా పార్టీలో వివాదాలు, గ్రూపుల కారణంగా ఈ సారి అక్కడ కూడా అధికారానికి దూరం అయ్యారు. కేరళలో వచ్చే దశాబ్బంలోగానైనా అధికారంలోకి రావాలన్నది భారతీయ జనతా పార్టీ యోచన. అయితే అక్కడున్న వామపక్ష కూటమి ప్రజలకు చేరువకావడంతో కమలనాధుల కలలు కల్లలుతున్నాయి. ఈ సారి కేరళను ముంచెత్తిన వరదలు, వర్షాలను అడ్డం పెట్టుకుని ఎలాగైనా అధికారంలోకి రావలన్నది స్ధానిక భారతీయ జనతా పార్టీ నాయకుల ఆలోచన.

 ఓ పక్క వరదలతో ప్రజలు ఇక్కట్ల పాలవుతూంటే రాజకీయ పార్టీల వారు మాత్రం దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్లోకి రావాలనుకోవడం దేశ రాజకీయ భ్రష్టత్వానికి పరాకాష్ట. కష్టాల్లో ఉన్న కేరళను ఆదుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేరళకు 25 కోట్ల రూపాయలు సాయం ప్రకటిస్తే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది కోట్ల రూపాయల తక్షణ సాయం ప్రకటించింది. ఇది మంచి పరిణామం.

ఇక తెలుగు సినీ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కూడా తమ వంతు సాయం ప్రకటించారు. ఇప్పటి వరకూ కష్టాల్లో ఉన్న వారికి ఆదుకునేందుకు తమిళ సినీ రంగమే ముందుకు వచ్చింది. ఆ మంచి సంప్రదాయానికి తెలుగు సినీ పరిశ‌్రమ కూడా శ్రీకారం చుట్టడం ప్రజలకు మరింత మంచి చేస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు