పవన్‌కు తప్పని పాట్లు...

పవన్‌కు తప్పని పాట్లు...

పవన్ కల్యాణ్ పవర్ స్టార్ జనసేన పార్టీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చేస్తానంటూ రాజకీయ ప్రవేశం చేసారు. తాను పేదల మనిషినని, సామాన్యుడి చేతిలో ఆయుధాన్నని చెప్పారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు కావాలా, జగన్మోహాన రెడ్డి కావాలా, పవన్ కళ్యాణ్ కావాలా అంటూ ప్రజలకు ఓ ప్ర‌శ్న కూడా వేశారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సొంత పార్టీలోని లుకలుకలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలువురికి పార్టీ బాధ్యతలను అప్పగించారు. ఇందులో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలు, క్రిష్ణ, గుంటూరు జిల్లాల కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు ఉన్నారు. ఇదే ఇప్పుడు పవన్ పాలిట శాపంగా మారింది. ఆయన నియమించిన కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లపై ఆయా జిల్లాలలోని ఇతర నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా తామంతా పార్టీని నమ్ముకుని ఉన్నామని ఇప్పుడు తమని కాదని కొత్తవారికి పదవులు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

పార్టీలో క్షేత్ర స్దాయిలో ఏం జరుగుతోందో పవన్ కల్యాణ్‌కు తెలియక పోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కు ఎలాంటి రాజకీయ అనుభవమూ లేదని పార్టీలో వివిధ మనస్తత్వాలున్న వారితో ఎలా నెట్టుకొస్తారో అని అంటున్నారు. తనకు కులాలు ముఖ్యము కాదని ఏ కులాన్ని వెనకేసుకుని రానని చెబుతున్న పవన్ కల్యాణ్ పార్టీలో కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గానికే కట్టాబెడుతున్నారని విమర్శలొస్తున్నాయి. ఇంతకు ముందు తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో కూడా ఇదే జరిగిందని, ఆ కారణంగానే ప్రజారాజ్యం నామరూపాలు లేకుండా పోయిందని అంటున్నారు. ఇప్పుడు పవన్ కల్యాన్ చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయని జనసేనలో చర్చ జరుగుతోంది. ఈ తలపోట్లుతో పవన్ కల్యాణ్‌కు చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు. తాను పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నానా యాతనలు పడుతూంటే కిందిస్ధాయిలో నాయకులు మాత్రం పార్టీని అప్రదిష్ట పాలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. జనసేన పార్టీలో ఆయన సొంత కులానికి చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, చివరకు పవన్ కల్యాణ్‌ని కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని వివిధ జిల్లాల నుంచి వస్తున్న నాయకులు అంటున్నారు. పరిస్ధితి ఇలాగే కొనసాగితే జనసేన పార్టీ ఊసులో లేకుండా పోతుందని ఆ పార్టీకి చెందిన వారు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు