బీజేపీ భీష్మాచార్యుడు వాజ్‌పేయి కన్నుమూత

బీజేపీ భీష్మాచార్యుడు వాజ్‌పేయి కన్నుమూత

మాజీ ప్రధాని, బీజేపీ వరిష్ఠ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి(93) దిల్లీలోని ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి జూన్‌లో తీవ్ర అస్వస్థతతో ఎయిమ్స్‌లో చేరారు. సుమారు 14 సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వాజ్‌పేయి అనంతరం అల్జీమర్స్ బారినపడ్డారు.
    
మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయి 2004 ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు దూరమయ్యారు. 2005లో ముంబయిలోని శివాజీ పార్క్‌లో జరిగిన బీజేపీ రజతోత్సవ వేడుకల్లో తాను ఎన్నికల రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు వాజ్‌పేయి ప్రకటించారు. అప్పటికి ఎంపీగా ఉన్న ఆయన 2009లో ఎంపీగా తన పదవీకాలం పూర్తయ్యాక మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
    
వాజ్‌పేయి 2009లో గుండెపోటుకు గురైన తరువాత ఆయన కొన్నాళ్లకు మతిమరుపు వ్యాధికి లోనయ్యారు. తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన్ను భారత ప్రభుత్వం భారత రత్న పురస్కారంతో గౌరవించింది.
    
ఆజన్మ బ్రహ్మచారి అయిన వాజ్ పేయి నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకుని, పెంచారు. వాజ్ పేయి మరణంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మరోవైపు, వాజ్ పేయి నివాసం వద్దకు ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చేరుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు