వాజ్ పేయి లేరంటూ గ‌వ‌ర్న‌ర్ ట్వీట్...వైర‌ల్!

వాజ్ పేయి లేరంటూ గ‌వ‌ర్న‌ర్ ట్వీట్...వైర‌ల్!

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉందంటూ ఎయిమ్స్ వైద్యులు కొద్ది సేప‌టి క్రితం తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. వాజ్ పేయి ఆరోగ్యం క్షీణించింద‌ని, ఆయన శ‌రీర అవ‌య‌వాలు చికిత్స‌కు స్పందించ‌డం లేద‌ని వైద్యులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో వాజ్ పేయి ఆరోగ్యంపై త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ చేసిన‌ ట్వీట్ పెను దుమారం రేపుతోంది.

వాజ్ పేయి ‘‘ఇక లేరంటూ’’ త‌థాగ‌త రాయ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. అయితే, ఆ ట్వీట్ వివాదాస్పదం కావ‌డంతో ....రాయ్ దానిని తొల‌గించి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఓ ఆలిండియా టీవీ చానెల్‌లో వచ్చిన వార్తలను చూసి తాను ట్వీట్ చేశానంటూ వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే, అధికారికంగా ఎయిమ్స్ హెల్త్ బుటిటెన్ వెలువ‌డ‌కుండానే రాయ్ ట్వీట్ చేయ‌డంపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

మ‌రోవైపు, కాసేప‌ట్లో ప్ర‌ధాని మోదీ ఎయిమ్స్ కు చేరుకోబోతున్నారు. బీజేపీ జాతీయ నేత‌లు,కేంద్ర‌మంత్రులు ఎయిమ్స్ కు చేరుకున్నారు. ఎయిమ్స్ ద‌గ్గ‌ర భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు. ఎయిమ్స్ కు వెళ్లే దారుల ట్రాఫిక్ ను మ‌ళ్లించారు. వీఐపీలు తిరిగే మార్గంలో కూడా ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఆసుత్రిలోకి బ‌య‌టి వ్య‌క్తుల‌ను అనుమ‌తించ‌డం లేదు. వాజ్ పేయి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుద‌ల కాగానే....భారీగా జాతీయ నేత‌లు ఎయిమ్స్ కు త‌ర‌లి వెళుతున్నారు.

ఈ రోజు త‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌న్నింటినీ బీజేపీ ర‌ద్దు చేసుకుంది. కాగా,  వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలంటూ దేశ వ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉజ్జ‌యినీలో 11 మంది వేదపండితులు ‘‘మహా మృత్యుంజయ’’ మంత్రం జపిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ప్రభుత్వ ఆయుర్వేద కాలేజి విద్యార్ధులు వాజ్‌పేయి కోసం హోమం నిర్వహిస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు