మెజార్టీ కాద‌న్నా.. మోడీ మాత్రం జ‌మిలిని వ‌ద‌ల‌ట్లేదుగా

మెజార్టీ కాద‌న్నా.. మోడీ మాత్రం జ‌మిలిని వ‌ద‌ల‌ట్లేదుగా

ప‌వ‌ర్ చేతిలో ఉంటే అంతే మ‌రి. మ‌న‌సుకు అనిపించింది.. చేయాల‌నుకున్న‌ది చేసే వ‌ర‌కూ నిద్ర పోనివ్వ‌కుండా చేయ‌టం ప‌వ‌ర్ సుగుణం. అందుకు ప్ర‌ధాని మోడీ అతీతం ఏమీ కాదు. ఏపీ విభ‌జ‌న విష‌యంలో ఎవ‌రెన్ని అనుకున్నా.. కోట్లాది మంది మ‌నోభావాలు ఏమైనా స‌రే.. త‌న పుట్టిన‌రోజు కానుక‌గా తెలంగాణ‌ను ఇవ్వాల‌ని ఒక్క‌సారి డిసైడ్ అయిన సోనియ‌మ్మ‌.. త‌న క‌ల‌ను నెర‌వేర్చేందుకు పార్ల‌మెంటు త‌లుపులు మూసి.. టీవీల్లో లైవ్ ను క‌ట్ చేసి మ‌రీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసే వ‌ర‌కూ ఆమె వ‌ద‌ల్లేదు.

సోనియా అయినా  మోడీ అయినా ఒక‌టే. తాము న‌మ్మిన దానిని పూర్తి చేసేందుకు ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా.. మ‌రెన్ని స‌వాళ్లు ఎదురైనా వాటిని స్వీక‌రిస్తారే కానీ.. వాటిని విడిచి పెట్టేందుకు సుతారం ఇష్ట‌ప‌డ‌రు. ఇప్పుడు ప్ర‌ధాని మోడీ సైతం ఇలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌మిలి ఎన్నిక‌ల కాన్పెప్ట్ ను తెర మీద‌కు తెచ్చిన ఆయ‌న స‌ర్కారు ప్ర‌తిపాద‌న‌ను మెజార్టీ పార్టీలు తిర‌స్క‌రించాయి.

జ‌మిలికి వ‌ద్దంటే వ‌ద్ద‌న్నాయి. కానీ.. దానిపై మోడీ మ‌న‌సు ప‌డిన త‌ర్వాత దాన్ని ఆపే స‌త్తా ఎవ‌రికి మాత్రం ఉంటుంది? అందుకే ఇప్పుడు జ‌మిలికి కొత్త రూపు ఇచ్చే దిశ‌గా భారీ క‌స‌ర‌త్తు జ‌రుగుతున్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. లోక్ స‌భ‌కు.. అన్నిరాష్ట్రాల అసెంబ్లీల‌కు ఒకేసారి ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌టం ద్వారా.. రాజ‌కీయ ఒత్తిడితోపాటు.. భారీ ఖ‌ర్చు తుగ్గుంద‌న్న మాట‌ను మోడీ ప‌రివారం చెబుతోంది. అయితే.. ఈ ప్ర‌తిపాద‌న‌ను కాంగ్రెస్ తో స‌హా ప‌లు పార్టీలు నో చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే.. జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న‌ను చ‌ట్ట‌ప‌రంగా ఉన్న అన్ని అడ్డంకులు తొల‌గించి..నిర్దిష్ట రూపం  ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో లా క‌మిష‌న్ తీవ్ర‌మైన క‌స‌ర‌త్తు చేస్తోంది. రాజ్యాంగం.. ప్రజా ప్రాతినిధ్య చ‌ట్టం.. లోక్ స‌భ‌.. అసెంబ్లీ నిర్వాహ‌ణ నియ‌మాలతో క‌లిపి స‌వ‌ర‌ణలు చేయాల్సిన ప‌రిస్థితి ఉంది.

అందుకే.. ఈ దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తుంది. వాస్త‌వానికి ఈ నెలాఖ‌రులోపు లా క‌మిష‌న్ గ‌డువు ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో జ‌మిలిపై క‌స‌ర‌త్తును మ‌రింత ముమ్మ‌రం చేస్తోంది. జ‌మిలి నిర్వ‌హించాలంటే చ‌ట్ట‌బ‌ద్ధంగా ఉండే అడ్డంకులు ఏమిటి?  వాటిని ఎలా అధిగ‌మించాలి? ఒకేసారి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అడ్డంకులు ఏమిట‌న్న అంశాల‌కు స‌మాధానాలు వెతుకుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం జ‌మిలి ఎన్నిక‌ల్ని 2019 నుంచి 2024 మ‌ధ్య‌లో రెండు ద‌శ‌లుగా నిర్వ‌హించొచ్చ‌ని.. రెండో ద‌శ‌ను 2024లో నిర్వ‌హించే వీలున్న‌ట్లు చెబుతున్నారు. ఇందుకోసం రెండు కీల‌క రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు చేయాల్సి ఉంటుంద‌ని లా క‌మిష‌న్ చెబుతోంది. ఇదిలా ఉంటే.. 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని నిర్వ‌హించనున్న‌ట్లుగా వ‌చ్చిన వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని బీజేపీ చెప్పింది.

లోక్ స‌భ‌కు.. అసెంబ్లీల‌కు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న‌ది త‌మ పార్టీ అధికారిక నిర్ణ‌యమ‌ని..  అలా అని 11 రాష్ట్రాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టం కోసం కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రప‌తి పాల‌న పెట్టాల‌న్న ప్ర‌చారం ఏ మాత్రం స‌రికాద‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నారు. మోడీ మ‌నసు పడిన త‌ర్వాత‌.. ఈ రూపంలో కాకున్నా మ‌రేదైనా రూపంలో జ‌మిలి ఎన్నిక‌ల్ని తెర మీద‌కు తేవ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి.. మోడీ మాష్టారు ఏం చేస్తారో చూడాలి.