మోడీ బ్యాచ్ మైండ్ బ్లాంక‌య్యే స‌వాల్ విసిరిన కాంగ్రెస్‌

 మోడీ బ్యాచ్ మైండ్ బ్లాంక‌య్యే స‌వాల్ విసిరిన కాంగ్రెస్‌

ముంద‌స్తు జ‌పంతో ఊగిపోతున్న అధికార బీజేపీకి అనూహ్యమైన స‌వాల్ ఎదురైంది. గెలుపు ధీమాతో ఉన్న  ఆ పార్టీ త‌న దూకుడును స‌మీక్షించుకోవాల్సిన స్థితిని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ క‌ల్పించింది. లోక్‌సభతోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని కాషాయ పార్టీ పెద్దలు గత కొద్దిరోజులుగా తీవ్రంగా కృషి చేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలకు కొన్నినెలల ముందు.. కొన్ని నెలల తర్వాత ఎన్నికలు జరుగాల్సిన రాష్ర్టాల అసెంబ్లీల కాలపరిమితిని పెంచడం లేదా తగ్గించడం ద్వారా జమిలి ఎన్నికలు నిర్వహించాలని, ఆయా రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉండటంతో ఎటువంటి రాజ్యాంగ సవరణ, చట్టపరమైన ప్రక్రియ అవసరం లేదని ఇన్నాళ్లూ కమలం పార్టీ భావించింది.

ఇందులో భాగంగానే ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలుపుతూ సోమవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా లా కమిషన్‌కు నివేదిక ఇచ్చారు. లోక్‌సభతోపాటు 11 రాష్ర్టాలకు ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపాదించారు.

ఈ ప‌రిణామాలు నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ త‌క్ష‌ణ‌మే స్పందించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌గెహ్లాట్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు జరుగాల్సి రాష్ర్టాల్లో పోలింగ్‌ను వాయిదా వేసి, 2019లో జరుగాల్సిన సార్వత్రిక ఎన్నికలతో కలిపి నిర్వహించడం రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదని స్పష్టంచేశారు.

మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువు ముగుస్తున్నందున కచ్చితంగా ఎన్నికలు నిర్వహించి తీరాలని తెలిపారు. దమ్ముంటే లోక్‌సభను రద్దు చేసి త్వరలో ఎన్నికలు జరుగాల్సిన మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలతో కలిపి లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడీకి కాంగ్రెస్ త‌ర‌ఫున సవాల్ విసిరింది.

`` జమిలి ఎన్నికల నిర్వహణకు ఒకేఒక్క మార్గం ఉంది. ప్రధాని లోక్‌సభను రద్దు చేసి.. నాలుగు రాష్ర్టాల ఎన్నికలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలి. దీని ద్వారా దేశంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని, అసహనాన్ని, బెదిరింపు ధోరణులను తరిమికొట్టవచ్చు. ముందస్తు లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్ స్వాగతించడమే కాదు.. బీజేపీని గద్దె దింపడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ ఒకే దేశం.. ఒకే ఎన్నిక నినాదాన్ని అందుకుంది`` అని అశోక్ గెహ్లాట్ ధ్వజమెత్తారు.

కాగా, బీజేపీ దూకుడుకు ఆదిలోనే బ్రేకులు ప‌డిన సంగ‌తి తెలిసిందే. రాజ్యాంగ సవరణలు, చట్టపరమైన ప్రక్రియ చేపట్టకుండా లోక్‌సభ, రాష్ర్టాల శాసనసభలకు కలిపి జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ మంగళవారం స్పష్టంచేశారు. వివిధ రాష్ర్టాల అసెంబ్లీల కాలపరిమితిని పెంచాలన్నా లేదా తగ్గించాలన్నా దానికి రాజ్యాంగ సవరణ తప్పనిసరని తెలిపారు.

జమిలి ఎన్నికలకు తగినన్ని పోలింగ్ యంత్రాలు అందుబాటులో లేవని స్పష్టంచేశారు. లోక్‌సభతోపాటు 11 రాష్ర్టాలకు ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. జమిలి ఎన్నికలకు చట్టపరమైన ప్రక్రియ తప్పనిసరని, సమీప భవిష్యత్తులో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం లేదని సీఈసీ ఓపీ రావత్ కుండబద్దలు కొట్టారు.  ఎన్నికల ప్రధాన కమిషనర్ వ్యాఖ్యలతో బీజేపీ అత్యుత్సాహంపై నీళ్లు చల్లినట్టయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు