రాహుల్ కు ట్వీట్ పంచ్ వేసిన కేటీఆర్!

రాహుల్ కు ట్వీట్ పంచ్ వేసిన కేటీఆర్!

తిరుగులేని అధిక్య‌తతో సాగుతున్న వేళ‌.. క్వ‌శ్చ‌న్లు చేసే ప‌రిస్థితిని ఎవ‌రు మాత్రం ఒప్పుకుంటారు. అందునా కేసీఆర్ కుటుంబానికి తిరుగులేని అధిక్య‌త న‌డుస్తున్న తెలంగాణ‌కు వ‌చ్చి.. అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేస్తే.. ఒళ్లు మండిపోదూ?  తాజాగా సాగిన రెండు రోజుల రాహుల్ ప‌ర్య‌ట‌న‌లో అదే జ‌రిగింది.  రాహుల్ లాంటోడు తెలంగాణ‌కు వ‌చ్చి.. అదే ప‌నిగా త‌మ‌ను విమ‌ర్శిస్తున్న వేళ‌.. కేటీఆర్ ట్వీట్ల‌తో త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయారు.

తొలిరోజు రాహుల్ మీద విరుచుకుప‌డేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఉతికి ఆరేసే ప్ర‌య‌త్నం చేస్తే.. రెండో రోజు త‌న ట్వీట్ల‌తో కేసీఆర్ కుమారుడు క‌మ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆ ప‌ని చేప‌ట్టారు.  స‌రూర్ న‌గ‌ర్ లో నిర్వ‌హించిన కాంగ్రెస్ నిరుద్యోగ గ‌ర్జ‌న‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వంపై రాహుల్ చేసిన ఆరోప‌ణ‌ల్ని కేటీఆర్ త‌ప్పు ప‌ట్టారు.

రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడ‌టం హాస్యాస్ప‌దంగా ఉందంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఫైర్ అయిన కేటీఆర్.. కాస్తంత వ్యంగ్యంతో కూడిన ట్వీట్ చేశారు. రాహుల్ జీ.. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా?  ఒక‌సారి మీ వేదిక మీద  ఉన్న వాళ్ల‌ని చూడండంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ పాల్గొన్న స‌భ‌లో వేదిక‌పై ఉన్న వారిలో స‌గానికి పైగా బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చినోళ్లేన‌న్న కేటీఆర్.. కొంత‌మంది సీబీఐ కేసుల్లో ఉన్నార‌న్నారు. మ‌రికొంద‌రు అవినీతి కేసుల్లో ఉన్నార‌ని చెప్పారు. అంత‌లోనే.. ఓహ్‌.. అది స్కామ్ గ్రెస్ పార్టీ అని మ‌ర్చిపోయా అంటే.. ఏ..బీ..సీల‌లో కాంగ్రెస్ చేసిన స్కాముల‌ను ఉద‌హ‌రించారు.

ఎ ఫ‌ర్ ఆద‌ర్శ్‌.. బీ ఫ‌ర్ బోఫోర్స్.. సీ ఫ‌ర్ కామ‌న్ వెల్త్ అంటూ మొద‌లెట్టి.. ఇంకా న‌న్ను కొన‌సాగించ‌మంటారా సార్‌? అంటూ ట్వీట్ పంచ్ వేశారు. ఇదే త‌ర‌హాలో మ‌రో ట్వీట్ లో రాహుల్ పై కేటీఆర్ విరుచుకుప‌డ్డారు. అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్ద ఎవ‌రికి నివాళి అర్పిచారో తెలుసా? అంటూ  ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. 1969 ఉద్య‌మంలో ఇందిరాగాంధీ నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన 369 మందికేన‌ని గుర్తు చేశారు.

2009 నుంచి 2014 మ‌ధ్య ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన వంద‌లాది యువ‌త‌కే రాహుల్ నివాళులు అర్పించారంటూ గుర్తు చేశారు. మొత్తానికి రాహుల్ ప‌ర్య‌ట‌న‌తో వ‌చ్చిన జోష్ ను తాను భ‌రించ‌లేక‌పోతున్న వైనాన్ని కేటీఆర్ త‌న ట్వీట్ల‌తో వెళ్ల‌గ‌క్కార‌ని చెప్పాలి. ఎందుకంటే.. అమ‌ర‌వీరుల గురించి ఇన్నేసి మాట‌లు మాట్లాడుతున్న కేటీఆర్.. తన తండ్రి కేబినెట్లో ఉద్య‌మ ద్రోహులు ఉన్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌టం. అంతేనా..? అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం.. వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాన‌న్న హామీలు ఇప్పుడు ఏమైపోయాయి?  లాంటి ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ఆన్స‌ర్ ఇస్తే బాగుండేదేమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు