రాహుల్ మరోసారి కన్ను కొట్టాడు

రాహుల్ మరోసారి కన్ను కొట్టాడు

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌కూడ‌ద‌ని కాంగ్రెస్ వ్యూహ‌క‌ర్త‌లు భావిస్తారో.. అదే అంశానికి సంబంధించిన వార్త‌ల్లోకి ఆయ‌న వ‌చ్చారు. క‌న్నుగీటిన వైనం రాహుల్ పై ఎన్ని జోకులు పేలేలా చేశాయో తెలిసినా.. మ‌ళ్లీ మ‌రోసారి క‌న్నుగీటిన ఆయ‌న కొత్త చ‌ర్చ‌కు తెర తీశారు.

మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం చ‌ర్చ సంద‌ర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ప్ర‌ధాని మోడీని ఆలింగ‌నం చేసుకోవ‌టం.. అనంత‌రం త‌న సీటు వ‌ద్ద‌కు వ‌చ్చి కూర్చున్న త‌ర్వాత పార్టీ స‌హ‌చ‌రుడికి క‌న్ను గీటిన వైనం సంచ‌ల‌నంగా మారింది.రాహుల్ కౌగిలింత మైలేజీని.. క‌న్నుగీటిన వైనం డ్యామేజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది చివ‌ర్లో రాజ‌స్థాన్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టించిన రాహుల్.. జ‌య‌పుర‌లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని షురూ చేశారు. ఈ సంద‌ర్భంగా రాజ‌స్థాన్ కాంగ్రెస్ లో ఎలాంటి విభేదాలు లేవ‌న్న విషయాన్ని ప్ర‌జ‌ల‌కు చాటి చెప్పే క్ర‌మంలో ఆయ‌న క‌న్నుగీటిన వైనం కెమేరా కంటికి దొరికిపోయింది.

రాజ‌స్థాన్ కాంగ్రెస్ నేత స‌చిన్ పైలెట్ కు.. మాజీ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లూట్ కు మ‌ధ్య ఎలాంటి పంచాయితీలు లేవ‌ని.. వారి మ‌ధ్య మంచి సంబంధాలు ఉన్నాయ‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు వీలుగా ఇరువురు ఆలింగ‌నం చేసుకోవాల‌న్న సందేశాన్ని స‌చిన్ పైలెట్ కు రాహుల్ త‌న క‌న్నుగీట చేశారు. ఆ వెంట‌నే.. న‌వ్వులు చిందిస్తూ ఇరువురు నేత‌లు ఆలింగ‌నం చేసుకున్నారు.  ఇదంతా సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. రాహుల్ క‌న్నుగీటితే కానీ.. ఇరువురు నేత‌లు త‌మ మ‌ధ్య సామర‌స్య వాతావ‌ర‌ణం ఉంద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిట‌న్నది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఏమైనా.. త‌మ‌కొచ్చే మైలేజీని క‌న్నుగీట‌తో పోగొట్టుకోవ‌టంలో రాహుల్ కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English