మోడీ పై ఫైర్ అయిన బీజేపీ సీనియ‌ర్ల

మోడీ పై ఫైర్ అయిన బీజేపీ సీనియ‌ర్ల

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్రమోడీ ఇటు బీజేపీలో అటు కేంద్ర ప్ర‌భుత్వంలో స‌ర్వం తానై న‌డిపిస్తుండ‌టం వ‌ల్ల మిగ‌తా మంత్రులంతా నామ్‌కేవాస్తీ అయిపోయారా? ప‌రిపాల‌న‌లో ప్ర‌క్రియ‌ల‌న్నీ మంత్రుల‌కు సంబందం లేకుండానే జ‌రిగిపోతున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. మోడీ ఏలుబ‌డిలో కేంద్ర మంత్రులంతా డ‌మ్మీలు అయిపోయార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారెవ‌రో కాదు...బీజేపీ సీనియ‌ర్లు.

ఆ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత‌లు తాజాగా ఈ కామెంట్లు చేస్తున్నారు. 'ప్రజాస్వామ్య పరిరక్షణ-రాజ్యాంగ పరిరక్షణ' అంశం పేరుతో ముంబయిలో జరిగిన చర్చలో మాజీ కేంద్ర‌మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్ శౌరీ, బీజేపీ సిట్టింగ్ ఎంపీ శ‌త్రుఘ్న‌సిన్హా ఈ మేర‌కు మోడీపై మండిప‌డ్డారు.

'మంత్రులకు చేయటానికి పనిలేదు... ఖాళీగా ఉంటున్నారు. మోడీ క్యాబినెట్‌ నిర్ణయాలన్నీ ప్రధానమంత్రి కార్యాలయమే (పీఎంఓ) తీసుకుంటున్నది' అని కేంద్రమాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా ముగ్గురు నేత‌లు మోడీ సర్కారుపై ఫైర్‌ అయ్యారు.

మోడీ ఏలుబ‌డిలో కీల‌క మంత్రుల‌కు ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని కేంద్రమాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రివర్గ నిర్ణయాలన్నీ 'ఒంటిచేత్తో' పీఎంఓ తీసుకుంటున్నదని, మంత్రులకు చేసేందుకు పని లేదన్నారు.

ఎవరైనా మంత్రులు తాము బిజీగా ఉన్నామని చెబితే వారు అబద్ధమాడుతున్నట్టే లెక్క అని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ ప్రకటించేంత వరకూ ఆ విషయం ఆర్థిక మంత్రిజైట్లీకీ తెలియదని యశ్వంత్‌ సిన్హా అన్నారు. 'విదేశాంగ మంత్రి (సుష్మా స్వరాజ్‌) పరిస్థితి కూడా అదేనని తెలిపారు.. విదేశాంగ శాఖకు చెందిన విధాన నిర్ణయాలు ఆమె వరకూ వెళ్లడం లేదని.,.. ఆమె ట్విట్టర్‌ మంత్రిగా మారిపోయారని ఆరోపించారు.

రాఫేల్‌ డీల్‌ జరిగినప్పుడు రక్షణ మంత్రి (నిర్మలా సీతారామన్‌)కి తెలియదు. ఇదో 35,000 కోట్ల రూపాయల స్కాం' అని తెలిపారు. కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేరును ప్రస్తావించకుండా, జమ్మూకాశ్మీర్‌లో పీడీపీతో తెగతెంపులు చేసుకోవాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం హోంమంత్రికి కూడా తెలియదన్నారు.

మరో కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ శౌరీ మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చేతిలో సీబీఐ పావుగా మారిపోయింద‌ని వ్యాఖ్యానించారు. సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని, అమిత్‌షా సీబీఐ నేరుగా రిపోర్ట్‌ చేస్తున్నదని ఆరోపించారు. యశ్వంత్‌ సిన్హా అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాన‌ని, పాల‌న ఏకీకృతం అయిపోయింద‌ని వ్యాఖ్యానించారు. బీజేపీ అసంతృప్తి ఎంపీ శత్రుఘ్నసిన్హా మాట్లాడుతూ, తనంతగా తాను పార్టీ నుంచి వైదొలగేది లేదని పునరుద్ఘాటించారు. త‌న‌పై పార్టీ పెద్ద‌లు ఎలాంటి ప్ర‌చారం చేసినా...వాటిని చిరున‌వ్వుతో స్వీక‌రిస్తాన‌ని వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు