భారీ స‌మ్మోహ‌నాస్త్రానికి కేసీఆర్ రెఢీ!

భారీ స‌మ్మోహ‌నాస్త్రానికి కేసీఆర్ రెఢీ!

నీకిది.. నాకిది అన్న వ్యాపార సూత్రాన్ని వ్యాపారులు త‌ర‌చూ ప్ర‌ద‌ర్శిస్తుంటారు. గ‌తానికి భిన్నంగా ఓపెన్ గా వ్యాపారుల మ‌ధ్య న‌డుస్తున్న డీల్ కు త‌గ్గ‌ట్లే.. అదే త‌ర‌హా  తీరుకు కూసింత ఎమోష‌న్ క‌లిపేసి మ‌రో రాజ‌కీయ సంచ‌ల‌నానికి తెర తీసే యోచ‌న‌లో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. హామీలు ఇచ్చి మ‌రీ వాటిని ప‌ట్టించుకోని తీరుకు భిన్నంగా.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌స్తావించ‌ని ఎన్నో వ‌రాల్ని స‌మ‌యానుకూలంగా తీసుకుంటూ.. త‌న మీద పాజిటివ్ ఓటు బ్యాంక్ ను సుస్థిరం చేసే భారీ ప‌థ‌కానికి కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్నారు.

ఎన్నిక‌ల వేళ ఇచ్చిన హామీకి త‌గ్గ‌ట్లే రుణ‌మాఫీని అమ‌లు చేసిన కేసీఆర్‌.. ఈ మ‌ధ్య‌న రైతుల‌కు పెట్టుబ‌డి సాయాన్ని అందించ‌టం తెలిసిందే. దీనితో సంతృప్తి చెంద‌ని కేసీఆర్‌.. రైతుల‌కు మ‌రింత మేలు చేకూర్చే దిశ‌గా ఆలోచిస్తున్నారు. వీటికి ఒక రూపు ఇస్తూ తాజాగా కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

మ‌రో తొమ్మిది నెల‌ల్లో ఎన్నిక‌లు వస్తున్న వేళ‌.. విప‌క్షాలు ఊహాల‌కు భిన్నంగా భారీ వ‌రాన్ని ప్ర‌క‌టించి.. అన్న‌దాత‌ల్ని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టానికి ముందు మ‌రోసారి రుణ‌మాఫీని అమ‌లు చేయ‌టం ద్వారా.. రైతుల ఓట్లు గంప‌గుత్త‌గా త‌న ఖాతాలో ప‌డేలా చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌చ్చినంత‌నే రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ హామీని ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. దీనికి త‌గ్గ‌ట్లే ఆ పార్టీ నేత‌లు త‌ర‌చూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ మాట‌లు జ‌నాల్లోకి వెళ్ల‌క‌ముందే.. వారి కంటే తాను మ‌రింత వేగంగా ఉన్న విష‌యం అర్థ‌మ‌య్యేలా చేయ‌టం కోసం రుణ‌మాఫీని మ‌రోసారి తెర మీద‌కు తెస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఎన్నిక‌ల లోపు మ‌రోసారి పెట్టుబ‌డి సాయం.. రుణ‌మాఫీని అమ‌లు చేస్తే.. వాతావ‌ర‌ణం పూర్తిగా త‌మ‌కు అనుకూలంగా మార‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కాస్తా.. ఆవిరైపోతుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల మొద‌లు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త‌ర‌చూ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చే హామీల‌కు ధీటుగా ఉండేలా త‌మ స‌ర్కారు చేత‌ల్లో చేసి చూపిస్తుంద‌న్నట్లుగా వ్య‌వ‌హ‌రించాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

మ‌రోసారి రుణ‌మాఫీ విష‌యంలో ఏమేం అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. రుణ‌మాఫీ ప‌రిమితిని ఎందుకు ఫిక్స్ చేయాల‌న్న ఆలోచ‌న కేసీఆర్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. ఈసారి రుణ‌మాఫీ ల‌క్ష కాకుండా.. ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కూ ప‌రిమితిని పెంచాల‌ని.. వీలైనన్ని ఎక్కువ వ‌ర్గాల‌కు ఈ ప‌థ‌కం కార‌ణంగా ప్ర‌యోజ‌నం పొందేలా కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌వేళ‌.. రుణ‌మాఫీపై సానుకూల నిర్ణ‌యం తీసుకుంటే.. ప్ర‌భుత్వం మీద ప‌డే భారం.. అందుకు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అనుకూలంగా ఉందా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

త‌మ ప్ర‌భుత్వం అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలుస్తుంద‌ని.. మ‌రే ప్ర‌భుత్వం కోసం ఇన్నేసి ప‌థ‌కాలు ఎవ‌రూ అమ‌లు చేయ‌లేద‌న్న భావ‌న క‌లిగించేలా భారీ ప్ర‌చారాన్ని చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రుణ‌మాఫీ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన ప‌క్షంలో ఎన్ని ద‌ఫాల్లో దాన్ని అమ‌లు చేయాల‌న్న అంశంపై ప్ర‌త్యేక క‌స‌ర‌త్తు చేయిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు తాజా రుణ‌మాఫీ క‌లిస్తే.. గులాబీ కారు జోరుకు తిరుగు ఉండ‌ద‌న్న మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు