అమెరికా అధ్యక్ష రేసులో మ‌న ఆడ‌బిడ్డ‌?

అమెరికా అధ్యక్ష రేసులో మ‌న ఆడ‌బిడ్డ‌?

అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల‌కు ఇంకా దాదాపు రెండేళ్ల కాలం ఉన్నప్ప‌టికీ...ఇప్పుడే ఆ దేశంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై చ‌ర్చ మొద‌లువుతోంది. స‌హ‌జంగానే అగ్ర‌రాజ్యం అధ్య‌క్ష ఎన్నిక‌లంటే స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఉంటుంది.

అయితే, ప్ర‌స్తుతం ఆ ఆస‌క్తి మ‌రింత పెరిగేందుకు కీల‌క ప‌రిణామం ఒక‌టి తోడైంది. అదేమిటంటే.. అమెరికా అధ్యక్ష పదవికి భారతీయ మూలాలున్న ఓ వ్యక్తి పేరు వినిపించడం. అది కూడా ఆషామాషీగా కాకుండా కీల‌క వ‌ర్గాల నుంచి సీరియస్‌గా ప్ర‌తిపాద‌న‌లోకి రావ‌డంతో అంద‌రి దృష్టి ఆమెపై ప‌డింది.

షెడ్యూల్ ప్ర‌కారం 2020లో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పదవి కోసం పోటీ చేస్తే డెమొక్రాటిక్ పార్టీ అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది చ‌ర్చ‌. ఈ పదవికి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఇటీవల కమలా హ్యారిస్ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా క‌మ‌ల ఉన్నారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవిని నిర్వహించిన కమల గత ఎన్నికల్లో అధ్యక్ష పదవికి తలపడ్డ హిల్లరీ క్లింటన్‌కు రాజకీయ సలహాదారుగా ఉన్నారు. క‌మ‌ల‌ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నారు. ట్రంప్ నియమాకాలపై, విధానాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వార్తలకెక్కుతున్నారు.

ఈ నేప‌థ్యంలో కమలను మించిన అభ్యర్థి ఉండరనే మాట బలంగా వినిపిస్తున్నది. డెమొక్రాటిక్ ఓటర్లపై జరిపిన టెలిఫోన్ సర్వేలో 70 శాతం మంది ఆమెకు మద్దతు తెలిపారు. వాషింగ్టన్ పోస్ట్ కూడా కమల డెమొక్రాటిక్ పార్టీకి మూడో అత్యుత్తమ అభ్యర్థి అని అభిప్రాయపడింది.

మ‌రోవైపు క‌మ‌ల వ్య‌క్తిగ‌త అంశాలు కూడా క‌మ‌ల అభ్య‌ర్థిత్వానికి బ‌లం చేకూరుస్తున్నాయి. భారతీయ, ఆఫ్రికా మిశ్రమ సంతతికి చెందిన కమల మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తరహాలో దేశానికి ఆశాకిరణం అవుతారని అభిమానులు భావిస్తున్నారు. కమల తల్లి తమిళ సంతతికి చెందిన శ్యామలా హ్యారిస్. బ్రెస్ట్‌క్యాన్సర్ పరిశోధకురాలైన శ్యామల చెన్నై నుంచి 1960లో అమెరికాకు వలస వెళ్లారు.

కాగా కమల తండ్రి జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్. ఈ దంపతులకు 1964లో కమల జన్మించారు. దౌత్యవేత్త అయిన తాత పీవీ గోపాలన్ చెన్నైలోని బిసెంట్ నగర్‌లో నివసించేవారు. కమల చిన్నప్పుడు స్కూలు సెలవుల్లో తరచుగా ఆయన దగ్గరకు వచ్చేవారు. కమలకు మాయా అనే ఓ చెల్లెలు కూడా ఉంది. కాగా, ఎన్నిక‌ల‌కు ఎంతో స‌మ‌యం ముందునుంచే అభ్య‌ర్థి పేరు చ‌ర్చ‌నీయాంశం కావ‌డం, అందునా స‌ద‌రు వ్య‌క్తి భార‌తీయ మూలాలున్న ఆమె కావ‌డం ఎన్నారైల దృష్టిని విశేషంగా ఆక‌ర్షిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు