వ‌ర‌ద బాధితుల కోసం విశాల్‘కేరళ రెస్క్యూ’!

వ‌ర‌ద బాధితుల కోసం విశాల్‘కేరళ రెస్క్యూ’!

గాడ్స్ ఓన్ కంట్రీ కేర‌ళ‌ను భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు అత‌లాకుత‌లం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త‌ ఐదు శతాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా వ‌రద‌లు కేర‌ళ‌ను ముంచెత్త‌డంతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మ‌యింది. కేరళలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకూ 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 54,000 మంది ప్ర‌జ‌ల‌ను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రజలకు ఆప‌న్న హ‌స్తం అందించేందుకు ప్రముఖ తమిళ హీరో, న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు విశాల్ ముందుకొచ్చాడు. కేర‌ళ వ‌ర‌ద‌బాధితుల స‌హాయార్థం ‘కేరళ రెస్క్యూ’ పేరుతో విరాళాలు సేకరించబోతున్నామ‌ని విశాల్ ట్వీట్ చేశాడు. రేపు చెన్నైలోని మహాలింగపురంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విరాళాలు సేకరిస్తామని విశాల్ తెలిపాడు. వయనాడ్ జిల్లాలోని వరద బాధితులకు వాటర్ బాటిళ్లు, సబ్బులు, టూత్ బ్రష్, పేస్ట్, టవల్స్, దుప్పట్లు, బెడ్ షీట్స్, మందులు,బిస్కెట్ ప్యాకెట్లు, క్యాండిల్స్, శానిటరీ ప్యాడ్స్, డైపర్స్, దోమతెరలు, డెటాల్ వంటి వస్తువుల్ని అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.

కేర‌ళ‌లో జూలై చివర్లో మొదలైన వర్షాలు ఇప్ప‌టికీ కురవ‌డంతో....ప‌లు జిల్లాలను వరద‌లు ముంచెత్తాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ఆ వ‌ర‌ద‌లధాటికి తీవ్ర ఆర్థిక, ప్రాణనష్టం సంభవించింది. దాదాపు 30 మంది మృతిచెందారు. విద్యుత్ సరఫరా, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఓఖి తుపాను నుంచి తేరుకోక ముందే కేర‌ళ‌పై వరదలు విరుచుకుపడ్డాయి. దీంతో, వ‌ర‌ద‌ల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షలు, ఇళ్లు కోల్పోయినవారికి రూ.10 లక్షల పరిహారం ఇస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. లక్ష చొప్పున అందిస్తామ‌న్నారు. దీనికితోడు ....కేర‌ళ వ‌ర‌ద‌బాధితుల‌కు స‌హాయం అందించేందుకు విశాల్ విరాళాల సేక‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు