మోడీకి మాత్రమే సొంత‌మైన అవ‌మానం ఇది!

మోడీకి మాత్రమే సొంత‌మైన అవ‌మానం ఇది!

ఔను. ప్ర‌ధాన‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టింది మొద‌లు త‌న‌దైన విభిన్న‌శైలితో ప‌లు ప్ర‌త్యేక‌త‌లు, రికార్డులు సంత‌రించుకున్న న‌రేంద్ర మోడీ ఇప్పుడు త‌న ఖాతాలోనే ఓ ప‌రాభావాన్ని న‌మోదు చేసుకున్నారు. రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం ప్ర‌కారం బహుశా భారతదేశ పార్లమెంట్‌ చరిత్రలో మ‌రే ప్రధానమంత్రికి ద‌క్క‌ని భిన్న‌మైన రికార్డ్ మోడీ సొంతం అయింది.

ఇంత‌కీ అదేంటంటే...పార్లమెంట్‌ రికార్డుల్లో నుంచి ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలోని కొన్ని పదాలను తొలగించారు! పార్లమెంట్‌ చరిత్రలో ఓ ప్రధానమంత్రి చేసిన ప్రసంగం నుంచి ఈ విధంగా పదాలు తొలగించడం ఇదే మొదటిసారి అని పేర్కొంటున్నారు. దీనికి కార‌ణం కీల‌క‌మైన ఓ ఎన్నిక‌లు కావ‌డం గ‌మ‌నార్హం.

ఈనెల 9వ తేదీన రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ ఎన్నిక జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విప‌క్షాల‌ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌ను ఉద్దేశించి  ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ద్వంద్వర్థ వ్యాఖ్య లు చేశారు. రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ఎన్నికైన తరువాత ప్రధాని రాజ్యసభకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఈ ఎన్నికల్లో ఇరు వైపుల 'హరి'(హరివంశ్‌, బీకే హరిప్రసాద్‌) ఉన్నాడు. కానీ ఒకరి పేరు ముందు 'బీ. కే హరి' ఉన్నది. ఇటువైపు(అధికారపక్షం) కూడా హరి ఉన్నాడు.

కానీ పేరు ముం దు బీకే, వీకే లేదు' అని అన్నారు. హిందీలో బీకే అంటే 'అమ్ముడు' అని అర్థం. దీన్ని ఉపయోగించి ప్రధాని ద్వంద్వర్థ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని, స్వయంగా ప్రధానమంత్రి అసభ్య పదాలు వాడుతు న్నారని ఆరోపించారు. ఎంపీ ఫిర్యాదుతో ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలోని పదాలను రాజ్యసభ చైర్మెన్‌ వెంకయ్యనాయుడు తొలగించారు. ఈ అంశాన్ని రాజ్యసభ సెక్రెటరీ ధ్రువీకరించారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్లమెంట్‌ చరిత్రలో ఓ అపఖ్యాతి మూటగట్టుకున్నారు.

కాగా 2013లోనూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, విపక్ష నేత అరుణ్‌జైట్లీ మధ్య మాటలయుద్ధం జరిగింది. ఆ సమయంలో గొడవకు సంబంధించిన ఇరువురి సంభాషణ రికార్డుల నుంచి తొలగించినట్టు తెలిసింది. అయితే ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో నుంచి ఇలా పదాలు తొలగించడం ఇదే మొదటిసారి. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా ప్ర‌ధాని మోడీ ప్రాస కోసం చూసి అప‌ఖ్యాతి సొంతం చేసుకున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు