మోడీ కేసీఆర్‌కు మ‌ళ్లీ షాకిచ్చాడు

మోడీ కేసీఆర్‌కు మ‌ళ్లీ షాకిచ్చాడు

ఔను. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో దోస్తీ కోసం ఓ వైపు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆరాట‌ప‌డుతుంటే...మ‌రోవైపు ప్ర‌ధాని మాత్రం ఆయ‌న‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఈ ఒర‌వ‌డిలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆశలపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. టీఆర్ఎస్‌ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు 'జాతీయ హోదా' ప్రకటించబోమని చెప్పకనే చెప్పింది. లోక్‌సభలో సీపీఎం ఎంపీ మహ్మద్‌ సలీం అడిగిన ఓ ప్రశ్నకు జలవనరుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ సమాధానం చెబుతూ ఈ మేర‌కు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు తెలిపారు. దీంతో షాక్ అవ‌డం అధికార టీఆర్ఎస్ పార్టీ వంతు అవుతోంది.

త‌మ క‌ల‌ల ప్రాజెక్టు అయిన‌ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రసర్కారు కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ప్రధానమంత్రిని కలిసి ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల ఆర్థికసాయం చేయాలని కోరారు. కానీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ సమాధానంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇక అందని ద్రాక్షగా మిగిలింది. లోక్‌సభలో గురువారం సీపీఎం ఎంపీ మహ్మద్‌ సలీం తీస్తా ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తారు. సీపీఎం పోరాడి ఈ ప్రాజెక్టును జాతీయహోదా పరిధిలోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. కానీ మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ప్రాజెక్టుపై మౌనం వహిస్తోందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించామని ప్రభుత్వం ప్రకటించిందని, మరీ తీస్తా ప్రాజెక్టుపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దీనిపై గడ్కరీ సమాధానం చెబుతూ... పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఏపీ, తెలంగాణ విభజన బిల్లు ఆధారంగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించామని తెలిపారు. కానీ దాని తరువాత మరే రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించొద్దని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత స్కీం ప్రకారం.. కొండ ప్రాంతాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో 90 శాతం నిధులు కేంద్రం ఇస్తుందని, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. ఈ విధంగా ఏఐబీపీ కింద తొమ్మిది ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. ఇక కరువు ప్రభావిత ప్రాంతాల్లో 60 శాతం నిధులు కేంద్ర సర్కారు.. 40 శాతం రాష్ట్ర సర్కారు ఇస్తోందని అన్నారు. పైగా రాజ్యాంగం ప్రకారం నీటిపారుదల రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని చెప్పారు.

ఇదిలాఉండ‌గా...కేంద్రమంత్రి సమాధానంపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గడ్కరీకి లేఖ రాశారు. దేశంలో ప్రత్యేకంగా ఎలాంటి ఇరిగేషన్‌ ప్రాజెక్టులకూ జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదనలు ఏవీ లేవని పార్లమెంటులో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించడాన్ని టీఆర్ఎస్‌ తప్పు పడుతోందని వినోద్‌కుమార్ తెలిపారు. గురువారం లోక్‌సభలో ఈ అంశంపై మాట్లాడేందుకు తమకు అవకాశం రాలేదని, అయినా అప్పటికప్పుడు కేంద్రమంత్రికి లేఖ రాశానని ఆయన చెప్పారు. ఆ లేఖలో కేంద్రం వైఖరిని నిరసిస్తూనే...కాళేశ్వరం లేదా పాలమూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో ఏదో ఒకదాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరంను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాము కూడా అదే విభజన చట్టం పరిధిలోకి వస్తామని, అందువల్ల తమ డిమాండ్‌నూ పరిశీలించాలని కోరామని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English