అక్కడ కింగ్ ఎవరు?

అక్కడ కింగ్ ఎవరు?

అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి.. ఇలా తమిళ రాజకీయ దిగ్గజాలంతా ఈ లోకాన్ని వీడారు. ఇప్పుడున్న నేతల్లో కానీ, కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నవారిలో కానీ ఈ తరహా నేతలెవరూ లేరు. అయితే... ఎవరూ పుట్టుకతో దిగ్గజాలు కారన్న చారిత్రక సత్యం... ఈ దిగ్గజాలు కూడా ఒకప్పుడు సాధారణ నేతలుగానే ప్రస్థానం మొదలుపెట్టినా క్రమేణా పరిస్థితులను అనువుగా మార్చుకుంటూ ఇంతగా ఎదిగారన్న వాస్తవం రెండూ గుర్తిస్తే ఇప్పడున్న నేతల నుంచి ఎవరైనా ఇలాంటి దిగ్గజాలుగా మారొచ్చన్న ఊహకు మద్దతు పలకొచ్చు.

ఇదంతా ఎందుకంటే.... కరుణానిధి తరువాత మళ్లీ ఆ స్థాయిని ఎవరి నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని తమిళులను అడిగితే ‘వీళ్లకంత సీను లేదు’ అన్న సమాధానమే వస్తోంది. అందుకే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయ ముఖచిత్రంలో కనిపిస్తున్న కొందరి గురించి చూద్దాం.
    
ఎంజీ రామచంద్రన్‌ (శ్రీలంకలో పుట్టిన మలయాళీ), జయ రామ్‌ జయలలిత (మైసూరుకు చెందిన బ్రాహ్మణ వ్యక్తి), ముత్తువేల్‌ కరుణానిధి (తెలుగు వ్యక్తి), ఈముగ్గురి శకం ముగిసింది. తమిళనాట రాజకీయ క్షేత్రంలో కొత్తశకం మొదలైంది. సినీ గ్లామర్‌తో రజనీ, కమల్‌ రంగ ప్రవేశం చేస్తున్నారు. డీఎంకే, అన్నాడీఎంకేకు కొత్త ప్రత్యర్థులు వస్తున్నా రు. మరొకవైపు అన్నా డీఎంకే వారసత్వం కోసం కూచుక్కూర్చున్న టీటీవీ దినకరన్‌ జయానగర్‌లో జయకేతనం ఎగురేసి సంచలనం సృష్టించాడు. ఈక్రమం లో రానున్న ఎన్నికల్లో తమిళ క్షేత్రంలో రణధీరులెవరన్నది ఆసక్తిగా మారింది.

తమిళనాడును శాసించిన ఎంజీఆర్, జయలలిత, కరుణానిధిలతో రజినీ కాంత్‌కి రెండు పోలికలున్నాయి. వారిలానే రజినీ కూడా సినీ రంగంలో పేరుప్రఖ్యాతులు సాధించకున్న వ్యక్తి. అంతేకాదు... తమిళనాడుకు పరాయివాడైనప్పటికీ తమిళుల అభిమానం అందుకున్నవాడు. ఎంజీఆర్ ఒక మళయాలీ, జయ కన్నడిగ, కరుణానిధి తెలుగు వ్యక్తి కాగా రజినీకాంత్ కర్ణాటకలో సెటిలైన మరాఠా.

రజినీ రాజకీయాలకు పూర్తిగా కొత్తే కానీ ఆయన ప్రభావం మాత్రం సుదీర్ఘకాలంగా తమిళ రాజకీయాలపై ఉంది.  1995లో పీవీ నరసింహారావుతో భేటీ తర్వాత రజనీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అయితే, అనూహ్యంగా కాంగ్రెస్‌ అన్నాడీఎంకేతో చేతులు కలిపింది. ఇది రజనీకి రుచించలేదు. దాంతో 1996 ఎన్నికల సమయంలో డీఎంకే-టీఎంసీ కూటమికి తలైవర్‌ మద్దతు తెలిపారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌-ఏఐఏడీఎంకే కూటమికి చావుదెబ్బ తినాల్సివచ్చింది. ఇక రజినీ మద్దతు పొందిన డీఎంకే-టీఎంసీ కూటమి అసెంబ్లి ఎన్నికల్లో 3 నుంచి 221 సీట్లు, లోక్‌సభ ఎన్నికల్లో 39 సీట్లతో దూసుకెళ్లిపోయింది.  ఇప్పుడు సొంత పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుండడంతో రజినీ ప్రభావం ఎలా ఉండబోతుందా అన్న చర్చ అంతటా ఉంది. ఇప్పటికప్పుడు ఆయన దూసుకెళ్లలేకపోయినా క్రమంగా బలపడతారని భావిస్తున్నారు.

మరో నటుడు కమల్ హాసన్ కూడా తమిళ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇప్పటికే పార్టీ ప్రకటించిన ఆయన ఇంతవరకు రాజకీయంగా దూకుడేమీ చూపించలేదు.  నటుడు, రచయిత, దర్శకుడు అయిన కమల్ కు కూడా తమిళనాడులో విపరీతమైన ఆదరణ ఉంది. రాష్ట్రంపై అవగాహన ఉన్న వ్యక్తి... మేధావి వర్గానికి చెందినవారిగా, అభ్యుదయవాదిగా గుర్తింపు ఉంది. డీఎంకేతో సన్నిహిత సంబంధాలున్న ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

ఇక కరుణానిధి రాజకీయ వారసుడు స్టాలిన్ గురించి చెప్పుకొంటే ఇంతవరకు తండ్రి చాటునే ఉంటూనే చాలావరకు పార్టీపై పట్టు సాధించిన నేత. దూకుడు ఎక్కువ, లౌక్యం తక్కువ అని పేరు. గత ఏడాది  ఆర్‌కే నగర్‌ ఎన్నిక ఓటమి స్టాలిన్‌ నాయకత్వ లోపాలను ఎత్తిచూపుతోంది. అధికార అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలినా, సునాయాసంగా గెలవాల్సిన చోట మూడో స్థానంలో నిలవాల్సిన పరిస్థితి స్టాలిన్‌ వైఫల్యానికి నిదర్శనమంటారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. తండ్రి మరణంతో రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవడం... ముఖ్యంగా అన్న అళగిరి, చెల్లెలు కనిమొళి, ఇతర ప్రధాన బంధుగణంలో కీలకమైన మారన్స్.. ఇలా అందరినీ కలుపుకొని తన నాయకత్వానికి అంగీకరించుకునేలా చేసుకోవడం ఆయన ముందున్న సవాల్. కోపిష్టి అయిన స్టాలిన్ ఇంత కోఆర్డినేషన్ చేయగలరా అన్నదే ప్రశ్న.

అమ్మ జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకేలో రెండు వర్గాలుగా చీలిపోయినా మళ్లీ పార్టీ కోసం కలిసి పన్నీర్ సెల్వ, పళనిస్వామిలూ తమిళ రాజకీయ తెరపై కథనాయకులే. ముఖ్యంగా వీరికి ప్రజాదరణ ఎంతన్నది పక్కనపెడితే రాజకీయాల్లో తలపండిపోయి ఉన్నారన్నది మాత్రం వాస్తవం.  జయ మరణానంతరం జరిగిన నాటకీయ పరిణామాల్లో…ఒకరినొకరు కత్తులు దూసుకున్నా..చివరకు ఒక్కటై పార్టీని అధికారంలో నిలిపారు. సొంత ఇమేజి లేకున్నాసొంత సామాజికవర్గాలే వీరికి అండాదండా. ఆపై అమ్మ బొమ్మ ఉండనే ఉంది.

జయలలిత మరణం తర్వాత తెరపైకి వచ్చిన నాయకుడు టీటీవీ దినకరన్‌. జయ నెచ్చెలి శశికళకు స్వయానా మేనల్లుడు. ఎమ్మెల్యే, ఎంపీగా అనుభవం.  శశికళ జైలుకెళ్లడంతో పార్టీ నుంచి బహిష్కరించగా కొత్త పార్టీ  అమ్మ మక్కల్‌ మునెట్ర కజగం పేరుతో కొత్త పార్టీ పెట్టారు.  జయలలిత ఇలాకా అయిన ఆర్‌కే నగర్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.  సామాజిక, ఆర్థిక వనరులు ఉన్నా, జన నాయకుడిగా ఇమేజీ లేదు. ఆర్‌కేనగర్‌లో ఓటర్లను డబ్బుతో కొని గెలిచారన్న ముద్ర ఉంది.

...ఇలా తమిళ తెరపై ఉన్న నేతల్లో ప్రస్తుతానికి తోపులెవరూ లేకపోవడంతో వీరిలో ఎవరో ఒకరు భవిష్యత్తులో కింగ్ అవుతారా.. లేదంటే కొత్త రాజు పుట్టుకొస్తారా అన్నది తమిళనాడులో చర్చనీయాంశమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English