ఆత్రేయపురం పూతరేకు అరుదైన రికార్డు

ఆత్రేయపురం పూతరేకు అరుదైన రికార్డు

ఏపీ పర్యాటక శాఖ కొత్త రికార్డు స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన తీపి పదార్థం పూతరేకులకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. గోదావరి జిల్లాలు పూత రేకుల తయారీకి ప్రసిద్ధి. ఇందులో ఆత్రేయపురం పూతరేకుల రుచే వేరు. ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం పూత రేకుతో ఇప్పుడు రికార్డు సృష్టించడానికి సిద్ధమవుతోంది.  పది మీటర్ల పొడవైన పూతరేకు రూపొందించి రికార్డు సాధించనుంది. అతి పొడవైన పూత రేకుగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోకి ఎక్కించేందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యాటక శాఖ చేసింది.

విజయవాడలో గురువారం ఈ అత్యంత పొడవైన పూత రేకును తయారు చేసేందుకు పర్యాటక అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు దీన్ని పూర్తిచేస్తారు. ఇది విజయవంతమైతే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు సంస్థ  ధృవీకరణ పత్రాన్ని అందిస్తుంది.

పూతరేకుల తయారీ కష్టంతో కూడుకున్న పని.. అలాంటిది ఏకంగా పదిమీటర్ల పొడవైనది తయారుచేయడమంటే ఆషామాషీ కాదు. ఇందుకోసం గోదావరి జిల్లాల నుం చి పాకశాస్త్రంలో ప్రావీణ్యులైన వారిని ఏపీటీడీసీ రప్పిస్తోంది. ఇదే సమయంలో రికార్డు కోసం ఎలాంటి ఆధునిక సాంకేతికను వాడడం లేదట. అత్యంత సంప్రదాయ పద్ధతిలో దీన్ని కుండలపైనే పూతరేకును తయారు చేయనున్నారు.

ఇప్పటికే ఆంధ్ర వంటకాలను ప్రోత్సహించేందుకు ఏపీటీడీసీ పలు చోట్ల ఆహార పండుగలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో అరకు బొంగు బిర్యానీని ఏపీ ప్రత్యేక వంటకంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా వంటవారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది పర్యాటక శాఖ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English