ఇంతకీ పవన్‌కు కులపిచ్చి ఉన్నట్లా.. లేనట్లా?

ఇంతకీ పవన్‌కు కులపిచ్చి ఉన్నట్లా.. లేనట్లా?

కుల పిచ్చి లేని పార్టీ తనది, కులపిచ్చి లేని నేతను తాను అంటూ చెప్పుకొస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్నదంతా నిజమేనా? ఆయనకు సొంత సామాజికవర్గం కాపులపై ప్రత్యేక అభిమానమేమీ లేదా? సొంత సామాజిక వర్గ నేతలకు ఆయన పార్టీలో ప్రత్యేకంగా చూడడం లేదా? ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటే ఆయన చెబుతున్న మాటలకు, చేతలకు మ్యాచ్ కావడం లేదంటున్నాయి రాజకీయ వర్గాలు. అందుకు ఉదాహరణలు కూడా చూపిస్తున్నాయి.

పవన్ ఇటీవల తన పార్టీలో పలు పదవులకు నియామకాలు చేపడుతూ వస్తున్నారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ మాజీ నేత మాదాసు గంగాధర్ ని పార్టీ లో చేర్చుకొని కోఆర్డినేటర్ గా పదవి ఇచ్చారు. ఆయన యాత్రకు ముందు  తోటా చంద్ర శేఖర్‌కు  పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. ఆ తరువాత జిల్లాల ఇంచార్జిలుగా, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా మరికొందరిని నియమించారు. వీరిలో అత్యధికులు సొంత సామాజికవర్గానికి చెందినవారేనని పవన్ అభిమానులే అంటున్నారు. ఇదంతా చూశాకే టీడీపీ కూడా పవన్ కులపిచ్చి గురించి ఆరోపణలు చేస్తోంది.

ఇక పవన్ ఏపీలో ఇల్లు కట్టుకున్న ప్రాంతం, పార్టీ ఆఫీసు నెలకొల్పిన ప్రాంతం వంటివన్నీ కూడా సామాజికవర్గ కోణంలో విమర్శలు ఎదుర్కొంటున్నాయి. తనకు కులాన్ని ఆపాదించొద్దని చెబుతూనే పవన్ కులాన్ని దువ్వే మాటలు చెబుతున్నారు. కాపులకు పదిహేడు శాతం రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఐదు శాతంతో ఎందుకు సరిపెట్టారంటూ ఆయన వేసిన ప్రశ్న వెనుక అంతరార్థం ఏంటి..? కుల వ్యవస్థ, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడే ఆయనకు ఈ శాతాల గోలెందుకు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేనా... కాపు రిజర్వేషన్స్ విషయంలో న్యాయం జరగకపోతే తునిలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతాయంటూ రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడడం దేనికోసం.. కాపుల ఓట్ల కోసం కాదని ఎవరైనా చెప్పగలరా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏపీలో పలు విషాధ ఘటనలు జరిగాయి... అందులో మొదటిది పుష్కరాల సమయంలో తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోవడం. ఆ తరువాత బస్సు ప్రమాదాలు కూడా చాలామందిని పొట్టనపెట్టుకున్నాయి. ఇక పడవ ప్రమాదాలూ ఎక్కువగానే జరిగాయి. వీటికి తోడు ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ తీవ్ర ప్రమాద ఘటన అంటే తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రస్ ను తగలబెట్టడం. ఈ సంఘటనలన్నిటి సమయంలో పవన్ ఎప్పుడు ఎలా స్పందించారో గుర్తుందా? కృష్ణానది పడవ ప్రమాదంలో ఇరవై మంది పైగా చనిపోతే పనవ్ ప్రకాశం జిల్లా వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. గోదావరిపై పడవ ప్రమాదాల విషయంలో ట్వీట్లు, ప్రెస్ నోట్లతో సరిపెట్టారు. పుష్కరాల తొక్కిసలాట మృతుల విషయంలో ఆయన ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇక జేసీ బ్రదర్స్ బస్సుల ప్రమాద ఘటనపై కూడా పవన్ స్పందన లేదు. కానీ... తుని ఘటన విషయంలో మాత్రం పవన్ రెస్పాన్స్ వేరేలా ఉంది. ఆ ఘటన జరిగేటప్పటికి కేరళలో ఉన్న పవన్ ప్రత్యేక విమానంలో వచ్చి వాలిపోయారు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అప్పటికి మిత్రుడే అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.

పవన్ ఏ విషయంలో ఎలా స్పందించారు.. పార్టీలో ఎవరున్నారు? ఎవరికి ప్రాధాన్యమిస్తున్నారు.. అభిమానులకు పార్టీలో స్థానం దక్కుతోందా లేదా వంటి అన్ని విషయాలూ లెక్కలోకి తీసుకున్నాకే ఆయన కులాభిమానంపై విమర్శలు వస్తున్నాయి. కానీ... పవన్ నుంచి మాత్రం దీనికి సమాధానం కరవవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు