చంద్రబాబు తొత్తు రేవంత్..

సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే, రేవంత్ పై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రేవంత్ రెడ్డితో పాటు విపక్ష నేతల విమర్శలపై, మల్లారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు దిక్కులేక పక్క పార్టీలో నుంచి రేవంత్ ను తీసుకు వచ్చారని, చంద్రబాబు తొత్తు, బినామీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ ను చేశారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓటుకు నోటు కేసులో డబ్బుల సంచులతో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, సీఎంపై ఇష్టమొమ్చినట్లు విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ పై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నిస్తున్నారని, కానీ, రేవంత్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారా? అని కేటీఆర్ అన్నారు.

కేసీఆర్ మిగతా రాష్ట్రాల మాదిరిగా మామూలు సీఎం కాదని, తెెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన, పుట్టించిన సీఎం అని, అలా కాదని ఎవరన్నా అనగలరా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అది చరిత్ర అని, ఎవరో దాస్తే దాగదని చెప్పారు. ఎవడుపడితే వాడు సీఎం గురించి మాట్లాడితే ఊరుకోబోమని, ఏడేళ్లు ఓపిక పట్టామని, కార్యకర్తలు, నేతలు ఆపినా ఆగేట్లు లేరని అన్నారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్ మద్దతు ఉన్న సంకీర్ణ ప్రభుత్వం…సీఎంను చెంపదెబ్బ కొడతా అన్న కేంద్రమంత్రిపై చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఇక్కడ కేసీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అది చూసి మల్లారెడ్డి ఆవేశంలో వ్యాఖ్యానించారని చెప్పారు. అయితే, కుక్కకాటుకు చెప్పుదెబ్బ అని, అదే తరహాలో రేవంత్ వ్యాఖ్యలకు మల్లారెడ్డి స్పందించారని, తాను ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానానా లేదా అన్నది ప్రశ్న కాదని అన్నారు. జర్నలిస్టుల ముసుగులో కొందరు సీఎంను విమర్శిస్తున్నారంటూ తీన్మార్ మల్లన్నపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు…ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు లిమిట్ ఉంటుందని, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడొద్దని హితవు పలికారు.

ఆనాడు ఉద్యమ సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులు చనిపోతున్నారన్న ఆవేదన, ఆవేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నేడు విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలతో పోల్చవద్దని అన్నారు. బండి సంజయ్…ప్రజా సంగ్రామ యాత్ర చేసేంత బాధ ఏం వచ్చిందని ప్రశ్నించారు.

బండికి పెట్రోల్ లేక పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్ కు వరదలొస్తే వెయ్యి కోట్లు ఇచ్చిన మోడీగారు తెలంగాణకు మొండిచెయ్యి చూపించారని, బీజేపీ పాలనలో బేచో ఇండియా ఉద్యమం జరుగుతోందని ఎద్దేవా చేశారు. ఆస్తులు గుర్తించి అమ్మేందుకు యాత్ర చేస్తున్నారని, మౌలాలిలో రైల్వే భూమి 21 ఎకరాలు అమ్ముతున్నారని దుయ్యబట్టారు. గతంలో డబుల్ బెడ్ రూంలు కట్టేందుకు నాలుగు ఎకరాలు అడిగితే కేంద్రం ఇవ్వలేదని మండిపడ్డారు.