జీవీఎల్ ఒక్కడు చాలు...

జీవీఎల్ ఒక్కడు చాలు...

జీవీఎల్ నరసింహరావు.. తెలుగోడే అయినా ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా. కొన్నాళ్లుగా ఆయన ఏపీ వ్యవహారాల్లో బీజేపీకి ప్రధాన గళంగా మారారు. ముఖ్యంగా టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టడమే ధ్యేయంగా పనిచేయడంతో పాటు టీడీపీతో ఆరోపణలు చేయడమూ పనిగా పెట్టుకున్నారు.

రాజకీయాల్లో ఇదేమీ వింతకాదు.. రాజకీయ నాయకులకు కొత్తా కాదు. కానీ, జీవీఎల్ తీరు మాత్రం ఆ పార్టీకి మైలేజ్ తేకపోగా తీవ్రంగా నష్టపరుస్తోంది. సరైన కసరత్తు లేకుండా.. తెలిసీతెలియని సమాచారంతో.. అడ్డగోలుగా, ఆధారాల్లేని ఆరోపణలు ఆయన చేస్తుండడంతో టీడీపీ నేతలు ఆయన్ను ఎండగట్టేస్తున్నారు. దీంతో ఆయన తాను చేసిన ఆరోపణలను తాను సమర్థించుకోలేక, దానికి కట్టుబడి ఉండబడిలేక కొత్త ఆరోపణలకు దిగుతూ మళ్లీమళ్లీ బోల్తా పడుతున్నారు. ఈ పరిణామాలను టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్తుండడంతో జీవీఎల్‌తో పాటు బీజేపీ కూడా అభాసుపాలవుతోంది.

కొద్దికాలంగా ఏపీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య విభజన హామీలు, నిధుల లెక్కల లొల్లి తీవ్రంగా జరుగుతోంది. దీనిపై ఎవరికి వారు లెక్కలు వినిపిస్తున్నారు. ఎవరు ఏం చెప్పినా దానికి అంతోఇంతో ఆధారాలు చూసుకుంటున్నారు. కానీ.. ఈ వ్యవహారాల్లో జీవీఎల్ తలదూర్చడం మొదలుపెట్టాక ఏపీ బీజేపీ నేతలకు తలనొప్పులు మొదలవుతున్నాయి. ఆయన అంతా తప్పుడు లెక్కలు చెబుతుండడంతో బీజేపీ ఏపీకి ఏమీ చేయకపోగా తిరిగి అవాస్తవాలు చెప్పి మోసం చేస్తోందంటూ రాష్ట్రంలో తిరుగుతున్న ఏపీ బీజేపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో ఏపీ బీజేపీ నేతలు జీవీఎల్‌ను చూసి వణుకుతున్నారట. ఇప్పటికే ఏపీలో పీకల్లోతు కష్టాల్లో ఉన్నామని జీవీఎల్ తీరు ఇలాగే ఉంటే పడే ఆ నాలుగు ఓట్లు కూడా పడడం కష్టమని వాపోతున్నారట.

కొద్దిరోజుల కిందట జీవీఎల్ ఏపీ ప్రభుత్వంపై భారీ అలిగేషన్ ఒకటి చేశారు. అది పీడీ అకౌంట్లను పెద్దసంఖ్యలో కలిగి ఉండడం.. అందులో భారీ మొత్తంలో డబ్బు మళ్లించడం. దీనిపై ఆయన కొన్ని ఇతర రాష్ట్రాలను ఉదాహరణలుగా చూపి అక్కడెక్కడా ఇన్ని ఖాతాలు లేవు.. ఏపీలోనే ఇన్ని ఖాతాలు ఉన్నాయని.. ఇది 2జీ కుంభకోణం కంటే పెద్దదని ఆరోపించారు. అయితే... టీడీపీ నేతలు అసలు పీడీ ఖాతాలు అంటే ఏంటి అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి.. అవి వ్యక్తిగత ఖాతాలు కావని, శాఖల తరఫున అధికారులు నిర్వహించే ఖాతాలని వివరిస్తూ ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో పీడీ ఖాతాలు ఉండడం.. అందులో వేల కోట్ల డబ్బు ఉందన్న విషయాన్ని గణాంకాల సహితంగా వివరించేసరికి జీవీఎల్ పాపం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి.

అటుతరువాత నిన్న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వద్దకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏపీ మంత్రుల బృందం రైల్వే జోన్ కోసం వెళ్లినప్పుడు అక్కడ జీవీఎల్ చేసిన హడావుడి కూడా ఆ పార్టీ పరువు బజారున పడేసింది. చివరకు మంత్రి కూడా ఈయన్ను రానివ్వడమే తప్పయిందన్నట్లుగా మొహం పెట్టారు. టీడీపీ బృదం వెళ్లి మంత్రిని కలిసేటప్పుడు మంత్రితో పాటు విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు, జీవీఎల్ ఉన్నారు. విశాక రైల్వేజోన్ గురించి హరిబాబు మాట్లాడినా కొంత అర్థం ఉండేది కానీ జీవీఎల్ మాట్లాడడంతో వివాదం మొదలైంది. పైగా... కేంద్ర మంత్రితో టీడీపీ బృందం మాట్లాడుతుంటే ఆయన్ను మాట్లాడనివ్వకుండా జీవీఎల్ తాను మధ్యలో దూరి హడావుడి చేయడం వివాదాస్పదమైంది. తెలుగువాడై ఉండి ఇలా ఆయన రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ అడ్డగోలుగా మాట్లాడడం పార్టీకి నష్టం కలిగిస్తోందని.. ఆయన్ను కట్టడి చేయకపోతే బీజేపీ పాలిట భస్మాసురుడిలా మారడం ఖాయమని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు