పీయూష్ నోట ఆంధ్రోడికి ఒళ్లు మండే మాట‌!

పీయూష్ నోట ఆంధ్రోడికి ఒళ్లు మండే మాట‌!

స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌ష్టం కానీ.. పీట‌ముడి వేయ‌టం చాలా ఈజీ. ఇప్పుడు ఇలానే వ్య‌వ‌హ‌రించారు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయిల్‌. మాట‌ల‌తో ఎంత‌లా ఇరిటేట్ చేయొచ్చ‌న్న విష‌యాన్ని త‌న చేత‌ల‌తో చేసి చూపించారాయ‌న‌. విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ఇస్తామ‌ని చెప్పిన రైల్వేజోన్ హామీ విష‌యంపై గ‌డిచిన నాలుగున్న‌రేళ్లుగా కేంద్రం ఎంత‌లా నానుస్తుందో తెలిసిందే.

మొన్న‌టికి మొన్న మోడీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నేప‌థ్యంలో జోన్ విష‌యంలో సానుకూల ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే. పార్ల‌మెంటులో రాజ్ నాథ్ చెప్పిన మాట‌కు భిన్నంగా విభ‌జ‌న హామీల‌పై సుప్రీంలో న‌డుస్తున్న కేసు సంద‌ర్భంగా కేంద్రం దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ అందుకు విరుద్ధంగా ఉండ‌టంతో ఆంధ్రోళ్ల‌కు మండిపోయేలా చేసింది.

ఏపీ ప్ర‌యోజ‌నాల మీద అలుపెర‌గ‌ని రీతిలో పోరాటం చేస్తున్న టీడీపీ నేత‌లు తాజాగా మ‌రోసారి త‌మ ఆకాంక్ష‌ల్ని కేంద్ర‌మంత్రి దృష్టికి తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు. రైల్వే జోన్ విష‌యంపై కేంద్రం వైఖ‌రిని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

విశాఖ‌కు రైల్వేజోన్ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయిల్ ను క‌లిసి త‌మ విన‌తిని తెలియ‌జేసేందుకు ఉత్త‌రాంధ్ర‌కు చెందిన రాష్ట్ర మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు అంతా క‌లిసి గోయిల్ అపాయింట్ మెంట్ తీసుకున్నారు. టైమిచ్చిన‌ట్లే ఇచ్చి.. రెండు ద‌ఫాలు వాయిదా వేసి స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టారు. మ‌ధ్యాహ్నం 2.20 గంట‌ల‌కు టైమిచ్చిన గోయిల్.. త‌న కోసం గంట‌ల కొద్దీ టైమ్ వెయిట్ చేసేలా చేసి రాత్రి 8.20 గంట‌ల టైంలో రైల్వేశాఖ కార్యాల‌యంలో మీటింగ్ పెట్టారు.

మంత్రి పీయూష్ తో పాటు.. బీజేపీ ఎంపీ జీవీఎల్ హాజ‌రు కావ‌టం ఒక ఎత్తు అయితే.. జోన్ మీద మాట్లాడాల్సిన పీయూష్ కు బ‌దులుగా జీవీఎల్ క‌ల్పించుకొని రైల్వే జోన్ కు కేంద్రం సుముఖంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. అక్క‌డితో ఆగ‌కుండా వెనుక‌బ‌డిన జిల్లాల నిధులు వినియోగం స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని.. అందుకే రూ.350 కోట్లు వెన‌క్కి తీసుకున్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు.. జీవీఎల్ వ్యాఖ్య‌లపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

ఏ హోదాతో ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేస్తార‌ని ప్ర‌శ్నించారు. ఈ గొడ‌వతో కేంద్ర‌మంత్రి బ‌య‌ట‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌బోగా.. మాజీ కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి స‌ర్దిచెప్పారు. జోన్ విష‌యంపై మాట్లాడిన మంత్రి.. రాష్ట్రాల వారీగా జోన్ ఇచ్చింది లేద‌ని.. దానిపై అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లుగా చెప్పారు. నిర్దిష్ట‌మైన కాలవ్య‌వ‌ధి చెప్పాల‌న్న టీడీపీ నేత‌ల మాట‌కు బ‌దులిస్తూ.. ఒళ్లు మండేలా మాట్లాడారు.

నెల కావొచ్చు.. రెండేళ్లు కావొచ్చు.. స‌మ‌యం చెప్ప‌టం క‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు తీవ్ర ఆగ్ర‌హాన్ని.. అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. రైల్వేజోన్ గురించి ఎంపీ అవంతి శ్రీ‌నివాస్ ప్ర‌స్తావించ‌ట‌మే కాదు.. వాకౌట్ చేశారు. త‌న మాట‌ల‌తో ఉత్త‌రాంధ్ర టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధుల మ‌న‌సుల్ని గాయ‌ప‌ర్చ‌ట‌మే కాదు.. ఐదు కోట్ల ఆంధ్రుల‌కు ఒళ్లు మండేలా కేంద్ర‌మంత్రి వ్య‌వ‌హ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు