క‌రుణానిధి మన తెలుగు వాడే

క‌రుణానిధి మన తెలుగు వాడే

త‌మిళ‌నాడులో మ‌రో శిఖ‌రం నెల‌కొరిగింది. డా. కళైజ్ఞర్ గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి(95) కన్నుమూశారు. కావేరి ఆస్పత్రిలో ఆయన మంగళవారం సాయంత్రం 6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కావేరి ఆస్పత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. త‌మిళ‌గ‌డ్డ‌పై త‌న‌దైన ముద్ర వేసుకున్న క‌రుణానిధి జీవిత విశేషాలివి.

- కరుణానిధి అసలుపేరు దక్షిణామూర్తి. పూర్వీకులు తెలుగువారు.

- తమిళనాడులోని నాగపట్నం జిల్లా తిరుక్కువలై గ్రామంలో 1924 జూన్ 3న జన్మించారు. తల్లి దండ్రులు ముత్తువేల్, అంజు.

- కళాసాహిత్య రాజకీయ రంగాల్లో ఆరితేరిన మేధావి.. 14వ ఏట రాజకీయాల్లోకి.. 20వ ఏట సినిమా రచయిత.. 33వ ఏట అసెంబ్లీలోకి ప్రవేశించారు.

- ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు. అంతకుముందు అణ్ణాదురై ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

- 1969, 1971, 1989, 1996, 2006 లో ఆయ‌న సీఎం పీఠంపై ఉన్నారు.

- ద్రవిడ ఉద్యమ పితామహుడు రామస్వామి నాయకర్, రథసారథి అణ్ణాదురైల అనుచరుడు.

- డీఎంకే పార్టీకి 50 సంవత్సరాల పాటు అధ్యక్షునిగా పనిచేశారు.

- మూడు పెండ్లిళ్లు (పద్మావతి, దయాళు అమ్మాళ్, రాజాత్తి అమ్మాళ్) చేసుకున్నారు. ఆరుగురు సంతానం. వారిలో ఎంకే స్టాలిన్, కనిమొళి ఇప్పడు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు.

- ఎంజీఆర్ (మంత్రికుమారి), శివాజీ గణేశన్ (పరాశక్తి) మొదటి చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే రాశారు.

- డైలాగులు రాయడంలో కరుణకు సాటిరాగలవారు తమిళ సినీరంగంలో లేరు.

- పరాశక్తి (1952) సినిమాలో సుదీర్ఘమైన కోర్టు సీన్, అందులో శివాజీ డైలాగులు చాలా పాపులర్ అయ్యాయి.

- రాజా రాణి (1956) చిత్రంలో శివాజీ గుక్క తిప్పుకోకుండా 5 నిమిషాల పాటు చెప్పే డైలాగు కరుణానిధి రాసిందే.

- నాటకాలు, సినిమాల ద్వారా ద్రవిడ సిద్ధాంతాల ప్రచారం భారీస్థాయిలో జరిగేది. అందులో కరుణానిధి సిద్ధహస్తుడు. ఆయన నాటకాలు అనేకం తర్వాతి రోజుల్లో సినిమాలుగా వచ్చాయి.

- తమిళంలో రచయితగా సుప్రసిద్ధుడు. కథలు, నవలలు, నాటకాలతో పాటు సినిమాలకు చిత్రానువాదాలు, డైలాగులు రాశారు.

- తమిళ సాహిత్యానికి, బాషకు ఆయన చేసిన సేవ అనితరసాధ్యం. ప్రాచీన తమిళ సాహిత్యంపై పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు.

- కరుణానిధి స్పృషించని సాహిత్య ప్రక్రియ లేదు. ఆయన కవితలు, లేఖలు, స్క్రీన్‌ప్లేలు, నవలలు, జీవితచరిత్రలు, చారిత్రిక నవలలు, నాటకాలు, సినిమలకు మాటలు, పాటలు రాశారు. ఆయన రాసిన వ్యాసాలకైతే లెక్కేలేదు.

- ప్రాచీన తమిళ తత్వవేత్త తిరువళ్లువర్ తిరుక్కురళ్‌పై కురళోవియం అనే పేరుతో వ్యాఖ్యానం రాశారు. చెన్నైలో వళ్లువర్ కొట్టం పేరిట నిర్మించిన అద్భుత స్మారక కేంద్రం, కన్యాకుమారిలో 133 అడుగుల వళ్లువర్ విగ్రహం ఆయన కృషి ఫలితమే.

- ఆత్మవంచనతో కూడిన సమాజాన్ని ఎండగడుతూ కరుణానిధి రాసిన తూగుమేడై నాటకం ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. నటి రాధిక తండ్రి ఎంఆర్ రాధాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ నాటకమే తెలుగులో రక్తకన్నీరుగా వచ్చింది. సినీనటుడు నాగభూషణంకు అది ఇంటిపేరుగా మారింది. రెండు భాషల్లోనూ సినిమాగా కూడా వచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English