మెరీనా బీచ్ లో క‌రుణ స‌మాధికి నిరాక‌ర‌ణ‌!

మెరీనా బీచ్ లో క‌రుణ స‌మాధికి నిరాక‌ర‌ణ‌!

నేడు సాయంత్రం క‌న్నుమూసిన డీఎంకే దివంగత నేత కరుణానిధి అంత్యక్రియల ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. చెన్నైలో  రేపు సాయంత్రం కరుణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి 8:30 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు గోపాలపురంలోని కరుణ నివాసంలో కరుణ భౌతిక కాయాన్ని సంద‌ర్శ‌నార్థం ఉంచనున్నారు. ఆ త‌ర్వాత సీఐటీ కాలనీలోని నివాసానికి తరలించ‌నున్నారు. అక్క‌డ‌ తెల్లవారుజామున 4 గంటల వరకు క‌రుణ పార్థివ‌దేహాన్ని ఉంచుతారు. ఆ త‌ర్వాత అక్కడి నుంచి రాజాజీ మండపానికి తరలించి ప్రజల సందర్శనార్థం కరుణ భౌతిక కాయాన్ని ఉంచబోతున్న‌ట్లు డీఎంకే వ‌ర్గాలు తెలిపారు. కాగా, కరుణానిధి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం చెన్నై రానున్నారు. ఆయ‌న‌తోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అజాద్ తోపాటు, ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం కేసీఆర్,  వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు చెన్నై చేరుకోనున్నారు.

మ‌రోవైపు, కరుణానిధి అంత్య‌క్రియ‌లు చేసే స్థలం విష‌యంలో వివాదం రేగుతోంది. చెన్నైలోని మెరీనా బీచ్ లో 'అన్నా మెమోరియల్' వద్ద క‌రుణ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు స్థలం ఇవ్వాలంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ .....సీఎం పళని స్వామికి విజ్ఞప్తి చేశారు. అయితే, హైకోర్టులో పలు కేసులు పెండింగ్ లో ఉన్నందున మెరీనా బీచ్ లో స్థలం ఇవ్వడం సాధ్యంకాదని ప‌ళ‌ని స్వామి స్ప‌ష్టం చేశారు. గాంధీ మండపం సమీపంలో గిండీ వద్ద (అన్నా వర్శిటీ ఎదురుగా) 2 ఎకరాలు స్థలం ఇచ్చేందుకు ప‌ళ‌ని సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో క‌రుణానిధి అభిమానులు, డీఎంకే కార్య‌క‌ర్త‌లు....స‌ర్కార్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మెరినీ బీచ్‌లోని అన్నా సమాధి పక్కనే క‌రుణానిధి అంత్యక్రియలు జరపడానికి ప్రభుత్వం అనుమతినివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మెరీనా బీచ్‌లో క‌రుణ‌ను సమాధి చేస్తే ఆ తర్వాత స్మారక మందిర నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతాయని, దానికితోడు ఆ స్థ‌లంపై హైకోర్టులో పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయని ప‌ళ‌ని స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు