రాజ్యసభ లెక్క తేలింది, మోదీకి మూడిందా?

రాజ్యసభ లెక్క తేలింది,  మోదీకి మూడిందా?

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నుంచి సునాయాసంగా గట్టెక్కిన మోదీ.. ఇప్పుడు రాజ్యసభలోనూ తన బలం చూపాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక మరో రెండు రోజుల్లో జరగనుండడంతో ఎలాగైనా తాము బలపరుస్తున్న అభ్యర్థినే గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చేనాటికి రాజ్యసభలో బీజేపీకి తగినంత సంఖ్యాబలం లేదు. అనంతరం వరుసగా జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలు విజయం సాధించడంతో అంచెలంచెలుగా రాజ్యసభలో ఎన్డీయే బలం పుంజుకుంది. దీంతో కురియన్‌ తర్వాత బీజేపీ అభ్యర్థి తొలిసారిగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ బాధ్యతలు చేపట్టగలరని ఎన్‌డీఏ వర్గాలు విశ్వసించాయి. కానీ గత మూడ్నాలుగు మాసాలుగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు బీజేపీని కొంతో ఆందోళనకు గురిచేస్తున్నాయి.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ఈ నెల 9న జరగనుంది. 8వ తేదీ మధ్యాహ్నంలోగా అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయాలి. ఇంతవరకు ఏకపక్షం అనుకున్న ఈ ఎన్నిక ఇప్పుడు మలుపు తిరుగుతోంది. యూపీఏ, ఇతర విపక్షాలు ఈ స్థానంపై ఆశలు పెట్టుకోవడమే కాకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అవిశ్వాస సమయంలో మోదీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేకపోయిన ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ నిలబెట్టిన అభ్యర్థిని ఓడించి మోదీని ఆత్మరక్షణలోకి నెట్టాలని ట్రై చేస్తున్నాయి.

రాజ్యసభ చరిత్ర చూస్తే... రాజ్యసభ మొదలైనప్పటి నుంచి మధ్యలో రెండున్నరేళ్ళు మినహా ఇంతవరకు కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థులే డిప్యూటీ చైర్మన్‌ పదవిలో కొనసాగారు. 1969 డిసెంబర్‌ 17నుంచి 1972 ఏప్రిల్‌ 1వ తేదీ వరకు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఎంపీ బిడి ఖోభ్రాగడే డిప్యూటీ చైర్మన్‌గా పని చేశారు. ఈసారి ఎలాగైనా తమ అభ్యర్థినే ఈ పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ గట్టిగా నిర్ణయిం చుకుంది. ఇందుక్కారణం రాజ్యసభలో ఆ పార్టీ బలం 71కి పెరగడం, మిత్రపక్షాల సహకారంతో సునాయాసంగా మ్యా జిక్‌ ఫిగర్‌ దాటేయగలమని భావించడం.

ప్రస్తుతం రాజ్య సభలో 244 మంది ఎంపీలున్నారు. మ్యాజిక్‌ ఫిగర్‌ 123. కురియన్‌ పదవీ విరమణ అనంతరం సొంత పార్టీ అభ్యర్థిని బరిలో దింపాలని బీజేపీ తలపోసే నాటికి తెలుగుదేశం, శివ సేన ఎన్‌డీఏకు మద్దతుగా ఉన్నాయి. బిజూ జనతాదళ్‌ కూడా అనుకూల వైఖరినే ప్రదర్శించేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలుగుదేశం వైరిపక్షంగా తయారైంది. శివసేన కూడా ఎన్‌డీఏకు దూరమైంది. బీజేడీ అంటీముట్టనట్లు వ్యవ హరిస్తోంది. దీంతో 123ఓట్లు సాధించడం ఆషామాషీ కాదని తేలిపోయింది. ప్రస్తుతం ఎన్‌డీఏకు టీఆర్ఎస్‌, అన్నా డీఎం కేలు మద్దతిచ్చే పరిస్థితి ఉంది. అన్నాడీఎంకేకు 13, టీఆర్‌ ఎస్‌కు ఆరుగురు, వైసీపీకి ఇద్దరు సభ్యులున్నారు. వీరందరి తో కలిపినా ఎన్‌డీఏ కూటమి బలం 109 అవుతుంది. బీజేడీ 9మంది, శివసేన ముగ్గురు ఎంపీల మద్దతు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వీరు కాక ఆరుగురు ఇండిపెండెంట్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

కాంగ్రెస్‌కు రాజ్యసభలో 50 మంది ఎంపీలున్నారు. వీరికి తృణమూల్‌ కాంగ్రెస్‌ తోడైంది. ఆ పార్టీకీ 13 మంది ఉన్నారు. సమాజ్‌వాదీకి మరో 13 మంది ఉన్నారు. దీంతో పాటు తెలుగు దేశం, డీఎంకే, ఎన్‌సీపీ, బీఎస్‌పీ, రాష్ట్రీయ జనతాదళ్‌, సీపీఎంకున్న ఐదుగురు సభ్యుల్ని కూడా విపక్షాల తరపున ఏక తాటిపైకి తెచ్చే యత్నాలు మొదలెట్టింది.

రాజ్యసభలో బలాబలాలు:

మొత్తం స్థానాలు: 245(ఇందులో బీహార్‌కు చెందిన ఓ స్థానం ఖాళీగా ఉంది)

ప్రస్తుతం ఉన్నవారు: 244 మంది

బీజేపీ: 71

కాంగ్రెస్‌: 50

తృణమూల్‌ కాంగ్రెస్‌: 13

అన్నాడీఎంకె: 13

బిజూజనతాదళ్‌: 9

తెలుగుదేశం: 6

టీఆర్ఎస్‌: 6

జనతాదళ్‌(యు): 6

సీపీఎం: 5

డీఎంకే: 4

బహుజన సమాజ్‌ పార్టీ: 4

ఎన్‌సీపీ 4

ఆప్‌ 3

సీపీఐ 3

శిరోమణి అకాలీదళ్: 3

వైసీపీ: 2

పీడీపీ: 2

జేడీఎస్‌, కేరళ కాంగ్రెస్‌, ఐయు ఎంఎల్‌, సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, ఇడీఎఫ్‌లకు ఒక్కొక్కరు స్వతంత్ర అభ్యర్థులు ఆరుగురు, నామినేటెడ్‌ సభ్యులు ఆరుగురు న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు